
ఆశ చూపి టోకరా!
వేలల్లో పెట్టుబడి పెట్టండి.. లక్షాధికారులు కండి ఎల్‌ఎఫ్ వర్క్ మనీ యాప్ పేరుతో రూ.5 కోట్లు వసూలు నిర్వాహకుడు ఊరి విడిచి వెళ్లడంతో మోసం వెలుగులోకి
నాగులుప్పలపాడు: మీరు కొంత డబ్బు చెల్లిస్తే రోజు వారీగా మీ బ్యాంకు ఖాతాలో మేము కొంత జమ చేస్తాం. వాటిని మీ అవసరాలకు మీ వద్ద ఉన్న యాప్ ద్వారా వారంలో మూడు రోజుల పాటు ఆ డబ్బును డ్రా చేసుకోవచ్చు. అంతే కాకుండా మీరు కొత్త వారిని మన వ్యాపారంలోకి చేరిస్తే వారి చేరిక ద్వారా వచ్చే కమీషన్ వెంటనే మీ ఖాతాలో జమ చేస్తాం. డబ్బు సంపాదించడానికి ఇంతకు మించిన మంచి తరుణం లేదంటూ ఆ ఊరి ప్రజలను నమ్మించి వంచించాడో ప్రబద్ధుడు. నిజమేనని నమ్మిన గ్రామస్తులు ఈ యాప్ ద్వారా సుమారు 500 మందికి పైగానే రూ.5 కోట్లకు పైగా చెల్లించి తిరిగి చెల్లింపులు లేకపోవడంతో పాటు ఈ యాప్ అలవాటు చేసిన వ్యక్తి ఊర్లో కనిపించకపోవడంతో మోసపోయామని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నాగులుప్పలపాడు మండలంలోని తిమ్మసముద్రం గ్రామానికి చెందిన తూతిక నాగాంజనేయులు అనే వ్యక్తి ఎల్‌ఎఫ్ వర్క్ మనీ పేరుతో ఉన్న యాప్ ద్వారా డబ్బులు పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు వస్తాయని గ్రామస్తులకు ఆశ చూపించాడు. గ్రామంలోనే సుమారు 500 మంది నుంచి రూ.5 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసి అందులో చేర్పించాడు. ఈ ఎల్‌ఎఫ్ వర్కు యాప్‌ను ఈ ఏడాది జనవరిలో నాగాంజనేయులుకు ఒడిశాకు చెందిన కొందరు వ్యక్తులు పరిచయం చేశారు. రూ.2400 డిపాజిట్ చేస్తే రోజుకి రూ.72 చొప్పున 9 నెలలు తిరిగి ఇస్తారు, రూ.6 వేలకు రోజుకి రూ.350 చొప్పున 9 నెలలు, రూ.12 వేలు చెల్లిస్తే రోజుకి రూ.725 చొప్పున 9 నెలలు ఇస్తామని చెప్పి ప్రజలకు అలవాటు చేసి మొదట్లో తిరిగి చెల్లింపులు కూడా చేశారు. అనంతరం ఆశావాహులు పెరిగారని నమ్మకం కుదిరిన తరువాత రూ.24 వేలు, రూ.51,100 లాంటి పెద్ద మొత్తాలను కూడా డిపాజిట్ చేయొచ్చని నమ్మబలికారు. ఎల్‌ఎఫ్ వర్కు పేరుతో చీరాల, ఇంకొల్లు ప్రాంతాల్లో కార్యాలయాలు కూడా తెరిచారు. దీనికి ప్రజలను బాగా అలవాటు చేయడానికి ఈ మధ్య కాలంలో చీరాలలోని ఓ రిసార్టులో హంగు, ఆర్భాటాలతో ఓ పెద్ద అవగాహన సభ ఏర్పాటు చేయడంతో పాటు వచ్చిన క్లైంట్లకు భారీ విందు కూడా ఇచ్చారు. దీనిని నమ్మిన జనం ఆగస్టు చివరి వారం, సెప్టెంబర్ మొదటి వారాల్లో అందిన కాడికి అప్పులు తెచ్చి కోట్లలో పెట్టుబడులు పెట్టారు. తిమ్మసముద్రం గ్రామానికి చెందిన తూతిక నాగాంజనేయులు ఈ సంస్థకు చీరాల ఏరియా మేనేజర్‌ని అని తనకు తానుగా పరిచయం చేసుకోవడంతో తిమ్మసముద్రం గ్రామంతో పాటు చీరాల, వేటపాలెం, పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల ప్రజలు తమ బంగారాలను సైతం తాకట్టు పెట్టి ఈ యాప్ లో పెద్ద మొత్తంలో జమ చేశారు. అయితే ఈనెల 13వ తేదీ నుంచి యాప్ ద్వారా రోజువారీగా వచ్చే డబ్బులు విత్‌డ్రా చేయడానికి రావడం లేదు. ఈ వ్యవహారం మొత్తానికి కారణమైన నాగాంజనేయులు ఊరి విడిచి వెళ్లిపోవడంతో పాటు 2 రోజుల నుంచి అతని ఫోన్ పనిచేయకపోవడంతో గ్రామంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం గ్రామంలో పోలీసులు విచారణ చేపట్టారు.
రూ.51 వేలు జమ చేశా..
బర్లీ పొగాకు వలన పూర్తిగా నష్టపోయిన తరుణంలో గ్రామంలో ఈ యాప్ ద్వారా ఎక్కువ మంది డబ్బులు సంపాదిస్తున్నారన్న సమాచారంతో అప్పు చేసి మరీ మా గ్రామానికి చెందిన యువకుడి ద్వారా రూ.51 వేలు జమ చేశాను. తీరా అసలు చూస్తే యాప్ ద్వారా మోసం జరిగిందని గ్రహించాం.
– దేశబోయిన వెంకట్రావు, బాధితుడు
నాతో పాటు, నేను చేర్పించిన వారూ నష్టపోయాం..
యాప్ ద్వారా డబ్బులు వస్తున్నాయన్న ఆశతో నేను స్వయంగా రూ.2.60 లక్షల పెట్టుబడి పెట్టడంతో పాటు నాకు తెలిసిన వారి ద్వారా మరో రూ.4 లక్షల వరకు పెట్టుబడి పెట్టించాను. చివరికి మోసపోయాం.
– మాగులూరి రత్తయ్య, బాధితుడు