
స్టడీ సర్కిల్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కో సంక్షేమ పథకం నిర్లక్ష్యానికి
గురవుతూ వస్తోంది. సంక్షేమ పథకాల సంగతి అటుంచితే విద్యార్థులు,
నిరుద్యోగుల కోసం పని చేస్తున్న
సంక్షేమ పథకం ఒక్కటీ లేదు.
ముఖ్యంగా జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ పనితీరు మరింత దారుణంగా ఉంది. పోటీ పరీక్షలకు శిక్షణ అక్కడ మచ్చుకై నా కనిపించడం లేదు. ఏడాదిలో రెండు నెలలు శిక్షణ ఇవ్వడం కూడా అక్కడ
గగనంగా మారుతోంది. నిరుద్యోగులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తూ వేలాది రూపాయలు చెల్లించలేక
నానా ఇబ్బందులు పడుతున్నారు.
బీసీ స్డడీ సర్కిల్ కార్యాలయం
ఒంగోలు వన్‌టౌన్:
కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు శిక్షణ కరువైంది. పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు పోటీ పరీక్షల కోసం ఉచితంగా శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేసిన ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆచరణలో నామమాత్రంగా పనిచేస్తోంది. ప్రస్తుత సంవత్సరంలో కేవలం డీఎస్సీకి మాత్రమే అధికారులు రెండు నెలల పాటు శిక్షణ ఇప్పించి చేతులు దులుపుకున్నారు. బీసీ స్టడీ సర్కిల్ సిబ్బంది వేతనాలు, కార్యాలయం నిర్వహణకు సంవత్సరానికి లక్షలు వెచ్చిస్తున్నా ఆశించిన స్థాయిలో నిరుద్యోగులకు శిక్షణ అందడం లేదు. దీంతో నిరుద్యోగులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తూ వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. అసలు బీసీ స్టడీ సర్కిల్ అనే సంస్థ ఒంగోలులో ఉంది అనే విషయం చాలా మంది నిరుద్యోగులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. బీసీ స్టడీ సర్కిల్‌పై అవగాహన కల్పించాల్సిన అధికారులు మిన్నకుండిపోయారు. ఒంగోలులో కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భవనాల సముదాయం వెనుక వైపు బీసీ స్టడీ సర్కిల్‌ను గతంలో ఏర్పాటు చేశారు.
ఈ స్టడీ సర్కిల్‌లో గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా ఆ వాతావరణం అక్కడ మచ్చుకై నా కనిపించదు. సంవత్సరంలో ఏదో ఒక శిక్షణను రెండు నెలల పాటు ఇప్పించి మిన్నకుండిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే జాబ్ నోటిఫికేషన్‌లకు అనుగుణంగా బీసీ స్టడీ సర్కిల్లో ఉచితంగా శిక్షణ అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిన్నర కాలంలో కేవలం డీఎస్సీకి మాత్రమే శిక్షణ ఇచ్చారు. ఇతర ఎటువంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చింది లేదు. బీసీ స్టడీ సర్కిల్లో బీసీలకు 66, ఎస్సీలకు 20, ఎస్టీలకు 14 శాతం మేర సీట్లు కేటాయించి శిక్షణ అందిస్తుంటారు. వీరితో పాటూ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అదనంగా సీట్లు కేటాయించే అవకాశం ఉంటుంది. 200 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. కోచింగ్ సమయంలో అభ్యర్థులకు నెలకు రూ.1500 స్టైఫండ్, మెటీరియల్‌కు రూ.1000 అందిస్తారు. 75 శాతం హాజరు ఉన్న వారికి స్టైఫండ్ ఇస్తారు. అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్టు ద్వారా ఎంపిక చేస్తారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఉండాలి.
ఆఫ్ లైన్, ఆన్‌లైన్ ద్వారా రెండు పద్ధతుల్లో అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించాల్సి ఉండగా ఒంగోలు బీసీ స్టడీ సర్కిల్లో కేవలం ఆఫ్‌లైన్‌లోనే శిక్షణ అందిస్తున్నారు. ఆన్‌లైన్‌లో శిక్షణను అందించేందుకు ఏర్పాట్లు లేవు. డీఎస్సీకి 200 మంది వరకు శిక్షణకు అవకాశం ఉండగా కేవలం 125 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 75 మంది లోపు మాత్రమే ఉచిత శిక్షణకు హాజరయ్యారు. వీరిలో కూడా చాలా మంది మధ్యలోనే మానేశారు.
సుశిక్షితులైన ఫ్యాకల్టీతో, సీనియర్‌లతో కోచింగ్ ఇవ్వాల్సి ఉండగా నామ మాత్రంగా జూనియర్లతో కోచింగ్ ఇప్పిస్తున్నారు. నాణ్యమైన శిక్షణ అందకపోవడంతో అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్‌కు రావడం లేదు. ఒక్కో ఫ్యాకల్టీకి సబ్జెక్టు గంటన్నరకు రూ.600 చొప్పున చెల్లిస్తున్నారు. అభ్యర్థులు నూతన విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకునేందుకు ఉద్దేశించిన లైబ్రరీలో నూతన పుస్తకాలు ఉండటం లేదు. ఎప్పటివో పాత పుస్తకాలతోనే నెట్టుకొస్తున్నారు. కరెంట్ ఎఫైర్స్ పుస్తకాలు ఎప్పటికప్పుడు కొనుగోలు చేయడం లేదు. బీసీ స్టడీ సర్కిల్లో కోఆర్డినేటర్, లైబ్రేరియన్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్లను ఔట్‌సోర్సింగ్ పద్ధతిన నియమించారు. వీరి జీత భత్యాలకే సంవత్సరానికి దాదాపు రూ.10 లక్షల వరకూ వెచ్చిస్తున్నా ఆశించిన పురోగతి కనిపించడం లేదు.
అవసరమైన శిక్షణ ఇస్తాం:
బదిలీపై నూతనంగా జిల్లాకు వచ్చా. బీసీ స్టడీ సర్కిల్లో ఇతర శిక్షణలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. మెగా డీఎస్సీలో బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన వారిలో ఏడుగురు అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చాయి.
– నిర్మలాజ్యోతి, బీసీ సంక్షేమ శాఖ అధికారి
కూటమి ప్రభుత్వంలో పోటీ పరీక్షలకు శిక్షణ కరువు
పేరుకే బీసీ స్టడీ సర్కిల్.. ఏడాదిలో రెండు నెలలే శిక్షణ
సిబ్బంది జీతభత్యాలకే ఏడాదికి అక్షరాలా రూ.10 లక్షలు