
నిర్లక్ష్యం వీడండి.. సమస్యలు పరిష్కరించండి
ఒంగోలు సబర్బన్:
సమస్యల పరిష్కారం కోసం వచ్చే అర్జీదారులతో అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ పి.రాజాబాబు హెచ్చరించారు. ఉద్యోగులు, అధికారులు ఇష్టారీతిగా ప్రవర్తిస్తే ఊరుకోబోనని స్పష్టం చేశారు. మంగళవారం ప్రకా శం భవనం నుంచి జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, డీఆర్‌ఓ బి.చిన ఓబులేసుతో కలిసి మండల స్థాయి అధికారులతో రెవెన్యూ సంబంధిత అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘కోరుకున్న చోటకు పోస్టింగ్ వచ్చింది కదా.. ఇక పరవాలేదులే’ అనుకుని ప్రజలతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఉపేక్షించేది లేదన్నా రు. సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని దిశానిర్దేశం చేశారు. ‘మీకోసం’ కార్యక్రమానికి వస్తున్న అర్జీల్లో ఎక్కువగా రెవెన్యూ సంబంధిత అంశాలవే ఉంటున్నాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లాలోని అధికార యంత్రాంగం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న టాప్–10 అంశాలకు సంబంధించిన పురోగతిని నిరంతరం పరిశీలిస్తూ ఉండాలన్నారు. ప్రజలు ప్రస్తావించిన, మీడియాలో వస్తున్న సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
డిమాండ్ల సాధనకే
యూటీఎఫ్ రణభేరి
ఒంగోలు సిటీ:
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ అబ్దుల్ హై, డి.వీరాంజనేయులు డిమాండ్ చేశారు. కూటమి పార్టీలు అధికారం చేపట్టి ఏడాదిన్నర గడుస్తున్నా ఉద్యోగుల సమస్యలపై స్పందించకపోవడం బాధాకరమని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 25న గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్న రణభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల్లో సభ్యులందరూ భారీగా తరలివచ్చి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని కోరారు. విద్యారంగ సమస్యలను ఒక్కటి కూడా పరిష్కరించకపోగా ఉపాధ్యాయులలో బోధనేతర పనులు చేయించడం సరికాదని పేర్కొన్నారు. పిల్లలకు పాఠాలు బోధించడం వరకే ఉపాధ్యాయులను పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు న్యాయంగా రావాల్సిన బకాయిలను ఏళ్ల తరబడి చెల్లించపోవడం వల్ల ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారం చేపట్టగానే పీఆర్సీ కమిషన్ సభ్యులు రాజీనామా చేశారని, ఇంత వరకు నూతన కమిషన్‌ను నియమించకపోగా, ఐఆర్ కూడా ప్రకటించకపోవడం సరైనాదేనా అని ప్రశ్నించారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బును సైతం చెల్లించకపోవడాన్ని ఆక్షేపించారు. పై అంశాలపై ప్రభుత్వ అధికారులకు అనేకమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందించలేదని, ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులందరితో కలిసి యూటీఎఫ్ రణభేరి మోగిస్తోందని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు ఉపాధ్యాయులను చైతన్యపరచడంతోపాటు ప్రజానీకానికి కూడా తమ బాధను తెలియజేశామన్నారు. ప్రభుత్వం ఇదే తీరును కొనసాగిస్తే భవిష్యత్తులో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అర్జీదారులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు
అధికారులకు కలెక్టర్ రాజాబాబు హెచ్చరిక
ఉపాధ్యాయుల సమస్యలపై కూటమి ప్రభుత్వ స్పందన శూన్యం
ఐఆర్ ఇవ్వకపోగా పీఆర్‌సీ నూతన కమిటీ ఏర్పాటుపై తాత్సారం
రేపు గుంటూరులో రణభేరికి తరలిరావాలని యూటీఎఫ్ నేతల పిలుపు