
నీళ్ల బాధలు.. ఇంకెన్నాళ్లు?
ఒంగోలు సబర్బన్: ఎన్‌ఎస్‌పీ కారుమంచి మేజర్ కాలువకు పడిన గండిని వెంటనే పూడ్చాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఆయకట్టు కమిటీ నీటి సంఘం అధ్యక్షుడు పాలడుగు వెంకట నారాయణ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఆయకట్టు కమిటీ నీటి సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ.. రామతీర్థం జలాశయం నుంచి సరఫరా అయ్యే సాగర్ నీరు చీమకుర్తి, సంతనూతలపాడు, టంగుటూరు మండలాలకు సక్రమంగా అందడం లేదన్నారు. దాదాపు 20 గ్రామాల ప్రజలకు నీరందించే కారుమంచి మేజర్ కెనాల్‌కు 2019లో చీమకుర్తిలోని మధుకాన్ గ్రానైట్ క్వారీ వెనుక భాగంలో భారీ గండి పడిందన్నారు. 18 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన ఈ కెనాల్‌లో గండి పడినప్పటి నుంచి 130 క్యూసెక్కులకు బదులు కేవలం 40 క్యూసెక్కుల నీరే ప్రవహిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గండి పడిన ప్రదేశం పక్క నుంచి తాత్కాలికంగా కాలువ ఏర్పాటు చేశారని, 40 క్యూసెక్కుల ప్రవాహం తొలి మూడు గ్రామాలకు కూడా సరిపోవడం లేదన్నారు. ఇక చివరి గ్రామాల ప్రజలు గొంతు తడుపుకోవడానికి కూడా నీరు అందడం లేదని చెప్పారు. కాలువ గండి పూడ్చేందుకు ప్రభుత్వం ఏపీడీఎంఎఫ్ నిధులు రూ.2.63 కోట్లు మంజూరు చేసినప్పటికీ నిర్మాణ పనులను మధుకాన్ గ్రానైట్ కంపెనీ యాజమాన్యం అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ కాలువ కింద ఉన్న గ్రానైట్ నిక్షేపాల కోసమే మధుకాన్ సంస్థ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాలువ స్థలాన్ని తమకు కేటాయిస్తే ల్యాండ్ రిక్రూట్మెంట్ ద్వారా కొంచెం ముందు నుంచి కాలువ తీస్తామనడాన్ని తప్పుబట్టారు. నీరు పల్లం నుంచి మెరకకు ఎక్కవన్న సంగతి మధుకాన్ యాజమాన్యం గుర్తుంచుకోవాలన్నారు. పాత డిజైన్ ప్రకారం కాలువ నిర్మిస్తేనే 20 గ్రామాల్లో ఉన్న ఆయకట్టు భూములకు నీరు అందుతాయని తేల్చిచెప్పారు. సాగు నీరు అందక రైతులు ఇప్పటికే చాలా నష్టపోయారన్నారు. 10 మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకులకు సక్రమంగా నీరు సరఫరా కాక ప్రజలతోపాటు పశువులకు తాగునీటి కోసం విలవిల్లాడాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ గండి పూడ్చకుండా అడ్డుతగులుతున్న మధుకాన్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం కలెక్టర్ పి.రాజాబాబుకు వినతి పత్రం అందజేశారు.
రామతీర్థం వద్ద సాగర్ కెనాల్‌కు పడిన గండిని పూడ్చాలి
మధుకాన్ గ్రానైట్ సంస్థ కుట్రలతోనే పనులకు అడ్డంకి
20 గ్రామాల ప్రజలు, రైతుల ఇబ్బందులు పరిష్కరించరా?
కలెక్టరేట్ వద్ద ధర్నాలో కారుమంచి మేజర్ కెనాల్ రైతుల ఆగ్రహం