
వ్యవసాయాన్ని రైతుకు లాభసాటిగా చేయాలి
15 శాతం వృద్ధి రేటు లక్ష్యంతో ముందుకు సాగాలి వ్యవసాయ అనుబంధ శాఖల సమీక్షలో కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: వ్యవసాయాన్ని రైతుకు లాభసాటిగా చేయడమే లక్ష్యంగా సంబంధిత అధికారులు పనిచేయాలని కలెక్టర్ పీ రాజాబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వ్యవసాయ అనుబంధ శాఖలైన హార్టీకల్చర్, పశుసంవర్ధక, మైక్రో ఇరిగేషన్, సహకార, ప్రకృతి వ్యవసాయం, మత్స్య శాఖల అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. ఆయా శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం 15 శాతం వృద్ధిరేటే లక్ష్యంతో వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలో వ్యవసాయానికి అనుకూలంగా ఉండి నిరుపయోగంగా ఉన్న భూమిని సాగులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి దానికనుగుణంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రతి రైతుకు ఖర్చు తగ్గించి ఉత్పత్తి పెంచేలా, అధిక ఆదాయం పొందేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రైతుల అవసరాలకు అనువైన యంత్రాలను గుర్తించాలన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలోని మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఆ మండలాల్లో రైతుల అవసరాలను గుర్తించి మంచి ఫలితాలు సాధించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.06 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అమలు చేస్తుండగా, మరో 1.01 లక్షల హెక్టార్లలో అమలు చేసేందుకు అవకాశం ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. రానున్న 2, 3 సంవత్సరాల్లో లక్ష హెక్టార్లలో సూక్ష్మ సేద్యం విధానాన్ని అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు తయారుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. పశుగ్రాసం పంపిణీ, పశు బీమా లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యాలకు వంద శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన వృద్ధి రేటు సాధించేలా మత్స్య శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.శ్రీనివాస రావు, పశుసంవర్ధక శాఖ జేడీ రవి కుమార్, మత్స్య శాఖ జేడీ శ్రీనివాసరావు, ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్ సుభాషిణి, మార్క్‌ఫెడ్ అధికారి శ్రీహరి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాస రావు, జిల్లా సెరీకల్చర్ అధికారి సుజయ్, జిల్లా ఉద్యాన శాఖాధికారి గోపిచంద్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.