
అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు
● ఎస్పీ హర్షవర్థన్‌రాజు
ఒంగోలు సిటీ: ప్రజలు, ప్రజా ప్రతినిధులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ వి.హర్షవర్థన్‌రాజు మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా ఇతరులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం, వాట్సాప్ గ్రూపులు, ఇన్‌స్ట్రాగామ్ వాల్‌పై అసభ్యంగా వ్యాఖ్యానిస్తున్న వారిపై దృష్టి సారించామని తెలిపారు. మహిళలు, ఇతరులను కించపరిచే రీతిలో వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, కులం–మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవన్నారు. సమాజాన్ని కలవరపెట్టేలా కాకుండా, వాస్తవాలను తెలుసుకున్న తర్వాతనే సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయాలని ప్రజలకు సూచించారు. యువత సోషల్ మీడియాను మంచి కోసమే వినియోగించుకోవాలని సూచించారు.