
రోడ్డు ప్రమాదంలో తెగిపడిన చిన్నారి కాలు
అర్ధవీడు: బొలెరో వాహనం ఎక్కడంతో ఓ చిన్నారి కాలు రెండు ముక్కలుగా తెగిపడింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గన్నెపల్లిలో బయట ఆడుకుంటున్న మూడేళ్ల ఆస్మ కాలిపై పత్తి లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం ఎక్కింది. చిన్నారి కాలు రెండు ముక్కలకు విడిపోవడం స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రమాదంలో చిన్నారి ఎడమ కాలు పూర్తిగా వేరైంది. చిన్నారిని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స చేశారు. అనంతరం గుంటూరు వైద్యశాలకు తీసుకెళ్లారని ఎస్సై శివ నాంచారయ్య తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.