
ఉచిత ఇసుక ఎక్కడ..?
● సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట
సీపీఎం నేతల ధర్నా
మార్కాపురం: మార్కాపురం పట్టణంలో ఉచిత ఇసుక అమలు కావడం లేదని సీపీఎం నేతలు సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు రఫీ, సోమయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఉచిత ఇసుక హామీ ఏమైందని ప్రశ్నించారు. టన్ను రూ.900లకే లారీ యజమానులు ఇస్తామని చెబుతుంటే, వారిని బెదిరించి కూటమి నాయకులు టన్ను రూ.1350 చొప్పున అమ్ముతుంటే మార్కాపురం ప్రజలకు ఉచిత ఇసుక దక్కేనా అని ప్రశ్నించారు. చిన్న చిన్న గృహ అవసరాలకు, మరమ్మతులకు కూడా ఇసుక అందని ద్రాక్షలా మారిందన్నారు. ఽఇసుక దందాను అరికట్టి ప్రజలకు అందుబాటులో ఇసుకధరలను అందుబాటులో ఉంచి భవన నిర్మాణ కూలీలను, భవన నిర్మాణ యజమానులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం వినతిపత్రం ఇచ్చారు.
ఒంగోలు: పురుషుల, సబ్ జూనియర్స్ బాల బాలికల సాఫ్ట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక ఈనెల 26న టంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ఏపీ సాఫ్ట్‌బాల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నరశింహారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2011 జనవరి 1వ తేదీ తరువాత జన్మించిన వారు మాత్రమే సబ్ జూనియర్స్ ఎంపికకు అర్హులు. ఆసక్తి గల క్రీడాకారులు తమ పుట్టిన తేదీ ధ్రువపత్రం, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో హాజరుకావాలని నరశింహారెడ్డి తెలిపారు. పూర్తి వివరాలకు సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు పేర్ని తిరుపతి స్వామి సెల్: 9949564264, త్రినాథ్‌బాబు సెల్: 9398479248 ను సంప్రదించాలన్నారు.
యర్రగొండపాలెం: భార్య చికెన్ వండలేదని భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన యర్రగొండపాలెం మండలంలోని గోళ్లవిడిపి గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై పి.చౌడయ్య కథనం మేరకు ఇంట్లో రోజూ పచ్చడి అన్నం పెడుతున్నావని ఇళ్ల లక్ష్మినారాయణ (25) తన భార్యతో గొడవ పడ్డాడు. ఆదివారం కావడంతో చికెన్ తినాలని ఉందని చెప్పినా ఆమె చికెన్ వండకపోవడంతో లక్ష్మినారాయణ తీవ్రమనస్థానికి గురై పొలానికి వెళ్లి అక్కడ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
యర్రగొండపాలెం: పురుగుమందు తాగి బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని పాలుట్ల గిరిజన గూడెంలో సోమవారం జరిగింది. ఎస్సై పి.చౌడయ్య కథనం మేరకు..దేశావత్ అంజలీబాయి(16)అనే బాలిక తన తమ్ముడు మంత్రూనాయక్‌ను బావి వద్దకు వెళ్లి నీళ్లు తీసుకురమ్మని చెప్పగా..అతను నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన అంజలీబాయి అలిగి పొలానికి వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి మంగ్లీబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఉచిత ఇసుక ఎక్కడ..?