
ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి
● ఎస్పీ హర్షవర్ధనరాజు
ఒంగోలు సిటీ: ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ వి.హర్షవర్ధనరాజు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కార్యక్రమానికి ప్రజల నుంచి 116 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ హర్షవర్ధనరాజు అర్జీలను స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సిబ్బంది జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. ప్రత్యేకించి వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు ప్రాధ్యానం ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్‌స్టేషన్లలో, సర్కిల్ కార్యాలయాలు, సబ్‌డివిజన్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఆయా పోలీస్‌స్టేషన్‌లో అధికారులు స్పందించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, చీటింగ్, ఉద్యోగ మోసాలు, ఇతర సమస్యలపై ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్, ఎస్సీ, ఎస్టీసెల్ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఒంగోలు ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ఒంగోలు వన్‌టౌన్ సీఐ నాగరాజు, దర్శి సీఐ రామారావు, కనిగిరి సీఐ ఖాజావలి, గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.