
టిప్పర్ కిందపడి యువకుడు మృతి
కొనకనమిట్ల: కంకర లోడుతో వస్తున్న టిప్పర్ కిందపడి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గొట్లగట్టు బస్టాండ్ సమీపంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని గొట్లగట్టు గ్రామానికి చెందిన పొదిలి తిరుపతయ్య కుమారుడు శ్రీనివాసులు(28) ద్విచక్రవాహనంపై బస్టాండ్ నుంచి వస్తున్నాడు. అదే సమయంలో చీమకుర్తి నుంచి కంకరలోడుతో టిప్పర్ లారీ వస్తుండగా..శ్రీనివాసులు టిప్పర్ పక్కగా వెళుతూ ప్రమాదవశాత్తు కిందపడగా టైర్ ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడు. మృతునికి భార్య లక్ష్మి, మూడేళ్ల పాప, 15 రోజుల పాప ఉన్నారు. 15 రోజుల క్రితమే శ్రీనివాసులు భార్య లక్ష్మి రెండో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చి పుట్టింటికి వెళ్లింది. రెండు రోజుల్లో శ్రీనివాసులు తన భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్ల దగ్గరుకు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిందని శ్రీనివాసులు తండ్రి తిరుపతయ్య, బంధువులు బోరున విలపించిన తీరు స్థానికులు కంటతడి పెట్టారు. సమాచారం అందుకున్న ఇన్‌చార్జి ఎస్సై వేమన, ఏఎస్సై ముల్లా మహమ్మద్‌లు సంఘటనా స్థలానికి వచ్చి ప్రమాదానికి కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీనివాసులు మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లారీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

టిప్పర్ కిందపడి యువకుడు మృతి