వెల్లువెత్తిన ఫిర్యాదులు
● పొన్నలూరు మండలం నాగిరెడ్డిపాలెం సర్వే నం.15/1లో 1.12 ఎకరాల భూమి పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా వచ్చిందని, దాన్ని దున్నేందుకు వెళుతుండగా గ్రామంలోని కొందరు దౌర్జన్యం చేస్తున్నారని గుమ్మళ్ల బ్రహ్మయ్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. తిరిగి నాపై కల్లూరి వెంకటేశ్వర్లు, కల్లూరు శ్రీను, తలకాయ మాధవ దాడి చేయగా..ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. నా పొలంలోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని వాపోయాడు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎస్పీకి తాను చెబుతానని, టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావును పిలిపించి ఎస్పీ వద్దకు తీసుకెళ్లాలని చెప్పారు.
● కొత్తపట్నంలోని ప్రభుత్వ ఆయుర్వేద స్థలం కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కొత్తపట్నంకు చెందిన బొమ్మిడాల వాసులు ఫిర్యాదుచేశారు. దీనిపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పారు. స్పందించిన కలెక్టర్ ఆయుర్వేద విభాగానికి చెందిన వైద్యులను పిలిచి మందలించారు.
ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైతే భవిష్యత్‌లో హాస్పిటల్ కట్టాలంటే ఏం చేస్తారని మండిపడ్డారు. కొత్తపట్నం తహసీల్దార్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆక్రమించిన వారికి నోటీసులు ఇచ్చి ఆక్రమణలు తొలగించాలని వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఒంగోలు సబర్బన్: ప్రకాశం భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తాయి. కలెక్టర్ పి.రాజాబాబు వినతిపత్రాలు స్వీకరించారు. బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పొటికలపూడి జయరాం విద్యాశాఖ అధికారులపై ఫిర్యాదు చేశారు. ఇటీవల సస్పెండ్ అయిన సింగరాయకొండ మండల ఊళ్లపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పిల్లి హజరత్తయ్యపై పోక్సో కేసు పెట్టాలని డీఈఓ ఆదేశాలు జారీ చేసినా ఆ టీచర్‌కు ఓ కార్పొరేషన్ చైర్మన్ అండగా ఉండటంతో ఇంత వరకు కేసు నమోదు చేయలేదన్నారు. హజరత్తయ్యపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన డిప్యూటీ ఈఓ చంద్రమౌళీశ్వరరావు నుంచి ఎస్సై ఫిర్యాదు తీసుకోలేదని తెలిపారు.