
శీతకన్ను!
పశ్చిమం అభివృద్ధిపై ఇంత నిర్లక్ష్యమా ! 15 నెలలు కావస్తున్నా ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు వెలుగొండ ప్రాజెక్టుకు అరకొర నిధులు ఏర్పాటుకాని మార్కాపురం జిల్లా హామీలకే పరిమితమైన అభివృద్ధి పనులు ఏర్పాటు
పశ్చిమంపై
జిల్లాలోని పశ్చిమ ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. గత ప్రభుత్వంలో వడివడిగా సాగిన మెడికల్ కాలేజీ, వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాలు కూటమి ప్రభుత్వం వచ్చాక నిలిచిపోగా.. మరే ఇతర అభివృద్ధి పనుల ఊసే లేకుండా పోయింది. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా నీటిమూటగానే మిగిలిపోయింది. పశ్చిమ ప్రకాశంపై కూటమి ప్రభుత్వ వివక్షపై జనం మండిపడుతున్నారు.
మార్కాపురం:
కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు కావస్తున్నా జిల్లాల్లో వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో ఒక్క అభివృద్ధి పనికూడా జరగలేదు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఎన్నికల హామీలు ఇంతవరకూ అమలుకాలేదు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులను కూడా నిలిపివేయడంపై ప్రజల్లో కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మార్కాపురం మండలం రాయవరం వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ, మూడు జిల్లాల్లో శాశ్వతంగా కరువును నివారించే వెలుగొండ ప్రాజెక్టు పనులు, మార్కాపురం పట్టణంలో షాదీఖానా నిర్మాణం, బీసీ భవన్, పొదిలి పెద్దచెరువు తదితర పనులన్నీ ఆగిపోయాయి. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపడతామని ప్రకటించడంపై ఈ ప్రాంత ప్రజల్లో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక వెలుగొండ ప్రాజెక్టుకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.309.13 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇలా కీలకమైన అభివృద్ధి పనులన్నీ నిలిచిపోగా కొన్ని మాత్రం నత్తనడకతో పోటీపడుతున్నాయి. ఎప్పుడు పూర్తవుతాయో ? ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. మార్కాపురం, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించారు. ఇక జిల్లా ఏర్పాటుపై అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ప్రకటనలు అయితే ఇస్తున్నారు కానీ కార్యరూపం దాల్చడంలేదు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ ప్రకాశం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యశాలను జీజీహెచ్‌గా మార్చి ప్రొఫెసర్లను నియమించారు. పెద్దదోర్నాలలో గిరిజన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మంజూరు చేశారు. పొదిలి పెద్దచెరువు నిర్మాణానికి రూ.50 కోట్లు ఇచ్చారు.
మెడికల్ కళాశాల కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిలిచిపోయింది. జిల్లా వైద్యశాల నుంచి జీజీహెచ్‌గా మారి అత్యున్నతమైన కార్పొరేట్ వైద్యసేవలను ఉచితంగా పేద ప్రజలకు అందించే హాస్పిటల్‌కు నేడు రోగులు కరువయ్యారు. కూటమి ప్రభుత్వం రాగానే మెడికల్ కాలేజీని అర్ధాంతరంగా ఆపడంతో పాటు పీపీపీ విధానంలో చేస్తామంటూ చేసిన ప్రకటన కూడా వాస్తవరూపం దాల్చలేదు.
జిల్లా ఏర్పాటు ప్రకటనలకే పరిమితం:
గత ఎన్నికలకు ముందు మార్కాపురాన్ని జిల్లాగా చేసి సీఎంగా మార్కాపురం వస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు హామీ నెరవేర్చకుండానే మార్చి 8న మార్కాపురంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి హాజరయ్యారు. అప్పుడు కూడా ప్రజలు అడిగిన ప్రశ్నలకు కచ్చితంగా జిల్లా చేస్తానని హామీ ఇచ్చాడు కానీ ఎప్పట్లోగా చేస్తానని మాత్రం ప్రకటించలేదు. ఇటీవల కాలంలో జిల్లా ఏర్పాటుపై ప్రకటనలు మాత్రం అధికారపార్టీల నుంచి వస్తున్నాయే తప్ప ఆచరణలో కనిపించడం లేదు. మార్కాపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటైతే జిల్లాలో వెనుకబడిన పశ్చిమ ప్రకాశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. 4 నియోజకవర్గాల్లోని 20 మండలాలకు చెందిన 10 లక్షల మంది ప్రజల అభివృద్ధికి జిల్లా ఏర్పాటు ఉపయోగపడుతుంది. క్షేత్ర స్ధాయిలో అభివృద్ధి పనులను అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తారు. కేంద్రం నుంచి వెనుకబడిన జిల్లాల ప్రత్యేక నిధులు వస్తాయి. కలెక్టర్, ఎస్‌పీ, అగ్రికల్చర్, హార్టీకల్చర్, జేడీలు, వైద్యశాఖ డీఎంహెచ్‌ఓ, ఇతర సంక్షేమశాఖల ఈడీలు ఇక్కడే ఉండి అభివృద్ధిని పర్యవేక్షించే అవకాశం ఉంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా మార్కాపురానికి వస్తుంది.
వెలుగొండ ఎప్పటికి పూర్తవుతుందో ?
నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడు తాను అధికారంలోకి రాగానే వెలుగొండను పూర్తిచేస్తానని చెప్పి బడ్జెట్‌లో రూ.309.13 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఏమాత్రం సరిపోవు. ముంపు గ్రామాల ప్రజల ఆర్‌ఆర్ ప్యాకేజీల కోసం కనీసం రూ.1200 కోట్లు కేటాయించాలి. ప్రభుత్వం కేటాయించిన నిధులు సిబ్బంది జీతభత్యాలకు, అరకొర పనులకు మాత్రమే ఉపయోగపడతాయి. మరోవైపు ప్రాజెక్టును 2026కు పూర్తిచేస్తామని చెబుతున్నా నిధుల కేటాయింపు జరగకపోవడంతో ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పశ్చిమ ప్రకాశం అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి.

శీతకన్ను!

శీతకన్ను!