
నేటి నుంచి దసరా నవరాత్రులు
త్రిపురాంతకంలో అక్టోబర్ 2 వరకు ప్రత్యేక అలంకారాలు ప్రతిరోజు వాహన సేవలు
త్రిపురాంతకం: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రం త్రిపురాంతకంలో బాలాత్రిపురసుందరీదేవి, పార్వతి సమేత త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక నవరాత్రి పూజా కార్యక్రమాలు వేదపండితుల మంత్రోచ్ఛరణలతో వైభవంగా నిర్వహించనున్నారు. నేటి నుంచి వచ్చే నెల 2వ తేదీ గురువారం వరకు దసరా నవరాత్రులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం మంగళ వాయిద్యాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అమ్మవారికి అభిషేకం, కాలపూజ, బాలభోగం, గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్వికరణం, పంచగవ్యప్రాసన, అఖండ స్థాపన, మండపారాధన, అష్టధిక్పాలకులకు పూజ, సప్తశతీపారాయణం, చండీహోమం ప్రత్యేక పూజలను వేదపండితులు నిర్వహించనున్నారు. ప్రతిరోజు దంపతులచే కుంకుమార్చనలు, ఉభయ దాతల పూజలు, గోపూజ, బాలపూజ, మహానివేదన, ఉభయదాతల ఆశీర్వచనం, ప్రత్యేక పూజలు భక్తులచే నిర్వహించనున్నారు. 22 సోమవారం నవరాత్రి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. అదే విధంగా 29 సప్తమి మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి పూజ, అక్షరాభ్యాసాలు, 30న దుర్గాష్టమి, మహర్నవమి ప్రత్యేక పూజలు, అక్టోబర్ 1వ తేదీ బుధవారం మహర్నవమి రోజున సుహాసిని పూజ, దంపతుల పూజలు, 2వ తేదీ గురువారం విజయదశమి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా పూర్ణాహుతి సందర్భంగా కుంభం, బలిహరణ, కూష్మాండదుర్గ, కలశ ఉద్వాసన సంప్రోక్షణ, భక్తులకు ఆశీర్వచనం, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ప్రతిరోజు ప్రత్యేక అలంకారం..వాహన సేవలు:
● 22 సోమవారం బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం పల్లకీసేవ, రాత్రి పద్మవాహనంపై అమ్మవారు ఉత్సవం నిర్వహించనున్నారు.
● 23వ తేదీ బ్రహ్మచారిణి అలంకారంలో హంసవాహన సేవ, 24న చంద్రఘంట వ్యాఘ్ర వాహనసేవ, 25న కూష్మాండదుర్గ అలంకారంలో శేషవాహనసేవ, 26న శైలిపుత్రి అలంకారంలో వాహనసేవ, 27న స్కందమాత అలంకారంలో మయూర వాహనసేవ, 28న కాత్యాయని అలంకారంలో సింహ వాహనసేవ, 29న కాళరాత్రి అలంకారంలో గజవాహన సేవ, 30న మహాదుర్గ అలంకారంలో నంది వాహన సేవ, అక్టోబర్ 1న సిద్ధిదాయిని అలంకారంలో అశ్వవాహన సేవ, 2న రాజరాజేశ్వరి దేవి అలంకారంలో గ్రామోత్సవం నిర్వహిస్తారు.
● త్రిపురాంతకేశ్వరస్వామి వారి ఆలయం వద్ద శమీపూజ, పారువేట కార్యక్రమం గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఆలయాల వద్ద దేవదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

నేటి నుంచి దసరా నవరాత్రులు

నేటి నుంచి దసరా నవరాత్రులు

నేటి నుంచి దసరా నవరాత్రులు