
ఐక్య ఉద్యమాల ద్వారానే హక్కుల సాధన
ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు సమరశీల పోరాటం రాష్ట్ర మహా సభలో ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు
ఒంగోలు సిటీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు అంగన్‌వాడీలు ఐక్య ఉద్యమాలు చేపట్టాలని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు పిలుపునిచ్చారు. అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆదివారం ఒంగోలు కొత్త మార్కెట్ సెంటర్ వద్ద రాష్ట్ర అధ్యక్షురాలు జీ బేబి రాణి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి సింధు మాట్లాడుతూ దేశంలో 80 శాతం ప్రజలకు పోషకాహారం అందడం లేదన్నారు. 70 శాతం మంది మహిళలు రక్తహీనతతో ఉన్నారని, దేశంలో ప్రతి రోజూ పౌష్టికాహార లోపంతో వేలాది మంది పసికందులు మృత్యువాత పడుతున్నారన్నారు. గౌరవ వేతనంతోనే పేదలకు పోషకాహారం అందిస్తూ సామాజిక బాధ్యతగా సేవ చేస్తున్న అంగన్‌వాడీలకు కనీస వేతనంతో పాటు తగిన గౌరవం దక్కాలంటే ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వేతనాల అమలులో ఒక్కో రాష్ట్రం ఒక తీరుగా చెల్లిస్తున్నారని, గుజరాత్‌లో కార్యకర్తలు రూ.24,800, హెల్పర్లకు రూ.20 వేల వేతనాన్ని కోర్టు ద్వారా సాధించిన వైనాన్ని గుర్తు చేశారు. ప్రతి వ్యక్తికి పోషకాహారం, విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలు కల్పించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్‌లో, మిడ్ డే మీల్ లో, రేషన్ లో కోత విధిస్తున్నట్లు దుయ్యబట్టారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ నెలలో కేంద్ర మంత్రుల నివాసాల వద్ద పది రోజులు పాటు ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎస్మా వంటి నిర్బంధాలు ఎదిరించి ఎన్నో విజయాలు సాధించిన ఉద్యమ స్ఫూర్తితో అంగన్‌వాడీలు స్కీమ్ వర్కర్స్, ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు.

ఐక్య ఉద్యమాల ద్వారానే హక్కుల సాధన