
మహిళా సాధికారత చేతల్లో చూపాలి
పొదిలి: మహిళా సాధికారిత గురించి పాలకులు మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మహిళా ఉపాధ్యాయ జిల్లా చైతన్య సదస్సు నిర్వహించారు. సహాధ్యక్షురాలు జి.ఉమామహేశ్వరి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో జాతీయ జండాను డి.గురవమ్మ, యూటీఎఫ్ జండాను రాజసులోచన, ఉమామహేశ్వరి ఆవిష్కరించి జండా వందనం చేశారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యూటీఎఫ్ కార్యకర్తలు పాఠశాలల్లో కుల, మత, ప్రాంత, లింగ బేధం చూడకుండా బోధించాలన్నారు. రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు గడుస్తోందని ఉపాధ్యాయులకు నెలనెలా జీతం తప్ప ఏమీ ఇవ్వటం లేదన్నారు. 11వ పీఆర్‌సీ, డీఏ, సరెండర్ లీవ్ బకాయిలు మంజూరు చేయలేదన్నారు. ఉపాధ్యాయులు దాచుకున్న సొమ్మును, రిటైర్డ్ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం రూ.30 వేల కోట్లు ఉన్నాయన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటించాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఎక్కువగా ఉన్నాయని, దీంతో బడులకు వచ్చే బడుగు, బలహీన వర్గాల పిల్లలకు బోధించే అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. ముందుగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా, తాలూకా నాయకులు అబ్దుల్‌హై, బాల వెంకటేశ్వర్లు, ఎస్.రవి, ఐవీ.రామిరెడ్డి, పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి మండలాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.