
పొంగిపొర్లి
దంచికొట్టి..
యర్రబాలెం బ్రిడ్జిపై నుంచి పారుతున్న గుండ్లకమ్మ వాగు
ఎల్లయ్య నగర్ వద్ద ఒంగోలు కర్నూలు రహదారిపై పారుతున్న వర్షం నీరు
కొండపేట ఆంజనేయస్వామి ఆలయం వద్ద సగిలేరువాగు
దర్శి: ఆర్టీసీ బస్టాండ్ ముందు భారీగా నిలిచిన వర్షం నీరు
సాక్షి నెట్‌వర్క్: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం భానుడు ఉగ్రరూపం దాలుస్తుండగా సాయంత్రానికల్లా ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలో నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కొన్ని గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
తాళ్లూరు: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి దోసకాయలపాడు, విఠలాపురం, మల్కాపురం, తాళ్లూరు గ్రామాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విఠలాపురం–తాళ్లూరు బ్రిడ్జిపై నీళ్లు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే దోసకాయల పాడు–తోట వెంగన్నపాలెం గ్రామంలోని బ్రిడ్జిపై వర్షం నీరు ప్రవహించడంతో పాటు రోడ్లు కోతకు గురవడంతో గ్రామస్తుల రాకపోకలు నిలిచిపోయాయి.
గుండ్లకమ్మ పరవళ్లు..
రాచర్ల: నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గుండ్లకమ్మవాగు పరవళ్లు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. చోళ్లవీడు గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద గుండ్లకమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అకవీడు, చోళ్లవీడు, చినగానిపల్లె పంచాయతీల్లోని తురకవానిచెరువు, దొడ్డేని చెరువు, రంగయ్యనాయుడు చెరువులకు గుండ్లకమ్మ వరద నీటితో కళకళలాడుతున్నాయి, చినగానిపల్లెలో రంగయ్యనాయుడు చెరువు అలుగు పారుతుండటంతో పంటకాలువలు, సైడుకాలువలు మరమ్మతులకు గురికావడంతో గ్రామం నుంచి మోకాలి లోతులో నీరు ప్రవహిస్తున్నాయి.
అర్ధవీడు: నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు మండల పరిధిలోని జంపలేరు వాగు పొంగడంతో పాపినేనిపల్లె నుంచి బొల్లుపల్లి, అచ్చెంపేట గ్రామాలకు వాహనరాకపోకలు స్తంభింఛాయి. దీంతో కంభం, గిద్దలూరు, ఒంగోలు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రానికి వాగు ప్రవాహం తగ్గడంతో రాకపోకలు కొనసాగాయి.
దర్శి పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు నీరు బయటకు వెళ్లే మార్గం లేక ఎక్కడడికక్కడ నిలిచిపోయింది. బస్టాండ్ ఆవరణలో భారీగా నీరు నిలిచింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానిక వెలవారి బజారులో భారీగా వర్షం నీరు నిలిచి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడతున్నారు.
కంభం చెరువుకు జలకళ
కంభం: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుండ్లకమ్మ, జంపలేరు వాగులు ఉధృతంగా పారుతుండటంతో కంభం చెరువుకు వరదనీరు వచ్చి చేరుతోంది. తురిమెళ్ల వద్ద వాగు ఉధృతంగా పారుతోంది. యర్రబాలెం వద్ద ఉన్న బ్రిడ్జిపై నుంచి వాగు పారుతుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మధ్యాహ్నం నుంచి వాగు ఉధృతిగా ఎక్కువగా ఉంది. ఇప్పటికే కంభం చెరువులో సుమారు 9 అడుగుల మేర నీరు ఉండగా గుండ్లకమ్మ, జంపలేరు వాగులు ఉధృతంగా కంభం చెరువు వైపుకు పారుతుండటంతో చెరువు నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. కంభం చెరువుకు నీరు చేరుతుండటంతో ప్రజలు భారీగా తరలివచ్చి తిలకిస్తున్నారు.
ముండ్లమూరు(దర్శి): ముండ్లమూరులో వేంపాడు వద్ద చిలకలేరు, ఈదరవాగు, వేములవాగు పొంగి పొర్లుతున్నాయి. వాగు ఉధృతితో రాకపోకలకు అంతరాయం కలిగింది.
చీమకుర్తి రూరల్: మండలంలో మర్రిచెట్లపాలెంలో ఆదివారం సాయంత్రం గంటకుపైగా భారీవర్షం కురిసింది. ఎల్లయ్య నగర్ నుంచి మర్రిచెట్లపాలెం వరకు రహదారిపై నీళ్లు పారుతూ జలమయమై ఒంగోలు – కర్నూలు రహదారి సాగర్ కాలువలను తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఉప్పొంగిన సగిలేరు వాగు
గిద్దలూరు రూరల్: గత శనివారం రాత్రి కురిసిన వర్షం కారణంగా మండలంలోని సగిలేరు వాగు ఉప్పొంగింది. ప్రధానంగా నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో దిగువమెట్ట గ్రామ సమీపంలో సగిలేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. భీమలింగేశ్వరస్వామి ఆలయం వద్ద నుంచి ప్రతాప్‌రెడ్డి కాలనీకి వెళ్లే రోడ్డు వాగు పొంగడంతో రోడ్డు నీటమునిగింది. స్థానికులు వాగు దాటకుండా పోలీసులు అప్రమత్తం చేశారు. కొండపేట సమీపంలో ఆంజనేయస్వామి ఆలయం మీదుగా సగిలేరువాగు ఉధృతంగా ప్రవహించడంతో జగనన్న కాలనీకి వెళ్లేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి నీరు విడుదల
మద్దిపాడు: మండలంలోని మల్లవరం వద్ద ఉన్న కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయం నుంచి ఆదివారం 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు రిజర్వాయర్ ఏఈ రామాంజనేయులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రెండు రోజులుగా గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నాలుగు గేట్లను 0.5 అడుగులు ఎత్తి పది వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌లోకి 7 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో 24 మీటర్ల వద్ద నీటిని నిలుపుదల చేస్తున్నారు. అదనంగా వస్తున్న నీటిని గుండ్లకమ్మ నదిలోకి విడుదల చేస్తున్నారు. పైనుంచి వచ్చే వరద నీటినిబట్టి కిందకు నీటి విడుదల పరిమాణాన్ని పెంచడం, తగ్గించడం చేస్తామని ఏఈ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
ఉదయం ఎండ..సాయంత్రం వర్షం
నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి
పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
పశ్చిమ ప్రకాశంలో అధిక వర్షపాతం