
గురజాడ, బోయి భీమన్నకు ఘన నివాళులు
ఒంగోలు మెట్రో:
సా్థనిక మంగమూరు రోడ్డులోని శివాజీ నగర్ రెండో వీధిలో ఉన్న రాజ్యలక్ష్మి నిలయంలో కళామిత్రమండలి (తెలుగు లోగిలి) సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మహాకవి గురజాడ అప్పారావు 163వ జయంతి, బోయి భీమన్న 114 జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు డా.నూనె అంకమ్మరావు అధ్యక్షత వహించి మాట్లాడారు. జాతీయ భావాలను గుండె నిండా నింపుకున్న నవ్యమార్గ నిర్దేశకులు, సాంఘిక దురాచారాలు, కులవ్యవస్థను చీల్చిచెండాడుతూ మానవతా వాదానికి పెద్దపీట వేసిన దార్శనికులు గురజాడ, బోయి భీమన్న అని కొనియాడారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ ప్రసంగిస్తూ కాలంతో పాటు కదులుతూ జీవితాన్ని, సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తూ భాషలోనూ, భావంలోనూ విప్లవాన్ని తమ రచనల్లో ప్రతిపాదించిన గొప్ప సంఘసంస్కర్తలు, ఆధునిక సాహిత్య భాస్కరులు గురజాడ, బోయి భీమన్న అని అన్నారు. ముత్యాల సరాల సృష్టికర్త, కొత్త జాడల వెలుగు జాడ గురజాడ అని శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడు కుర్రా ప్రసాద్ బాబు తెలిపారు. సంస్థ ప్రధాన కార్యదర్శి సింహాద్రి జ్యోతిర్మయి, జంగం రాజశేఖర్, తేళ్ల అరుణ, యు.వి.రత్నం, కేఎస్వీ ప్రసాద్, గుంటూరు సత్యనారాయణ, బీరం అరుణ, నాళం నరసమ్మ తదితరులు పాల్గొని గురజాడ, బోయి భీమన్నలకు నివాళులర్పించారు.
గొప్ప సంఘ సంస్కర్త గురజాడ
జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయప్రకాష్
ఒంగోలు సిటీ: కన్యాశుల్కం, బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాలను మహాకవి గురజాడ అప్పారావు తీవ్రంగా వ్యతిరేకించారని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ జయప్రకాష్ అన్నారు. జన విజ్ఞాన వేదిక ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సాయిరాం బాలికల జూనియర్ కళాశాలలో ఆదివారం గురజాడ 164వ జయంతి ఉత్సవం నిర్వహించారు. తొలుత గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయప్రకాశ్ మాట్లాడుతూ శ్రీమతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటే నిలిచి వెలుగునుశ్రీ అని ప్రకటించిన సత్యశోధకుడు గురజాడ అన్నారు. గురజాడ రాసిన దేశభక్తి కవిత అర్థవంతమైందనీ, నేటి పరిస్థితులకు చక్కగా సరిపోతుందని, విద్యార్థులు ప్రతి ఒక్కరూ గేయాన్ని చదివి అర్థం చేసుకోవాలని కోరారు. మహాకవి గురజాడ జయంతిని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరారు. జేవీవీ నగర ప్రధాన కార్యదర్శి ఎన్‌టీ వెంకటేష్ మాట్లాడుతూ జేవీవీ ఆధ్వర్యంలో దేశభక్తి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, పాటలు, డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 12న పోటీలు నిర్వహించి విజేతయలకు బహుమతులు అందజేస్తామన్నారు. కళాశాల ప్రిన్సిపల్ రాఘవ, సీనియర్ లెక్చరర్స్ ఫణింద్ర, అంజిరెడ్డి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

గురజాడ, బోయి భీమన్నకు ఘన నివాళులు