
రెండు రోజుల్లో విదేశాలకు..అంతలోనే
కనిగిరిరూరల్: రెండు రోజుల్లో ఆస్ట్రేలియాకు బయల్దేరాల్సిన యువకుడు.. మృత్యువడికి చేరిన దుర్ఘటన కనిగిరిలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళి.. పట్టణంలోని కొత్తపేటకు చెందిన ముక్కు సుధీర్‌రెడ్డి(34) ఆస్ట్రేలియాలో పదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల సుధీర్‌రెడ్డి తాత దేవిరెడ్డి వెలుగొండారెడ్డి మృతి చెందడంతో కనిగిరికి వచ్చి నెల రోజులుగా ఇక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లి తిరిగి బైక్‌పై కనిగిరి పట్టణంలోకి వస్తుండగా పామూరు రోడ్డులోని కొత్తూరు సమీపంలోని మిల్లు దగ్గర కుక్క అడ్డం రావడంతో తప్పించే క్రమంలో బైక్ పైనుంచి జారి కింద పడ్డాడు. ప్రమాదంలో సుధీర్‌రెడ్డికి తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లాడు. క్షతగాత్రున్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు సుధీర్ రెడ్డి(34), విశ్రాంత టీచర్ ముక్కు నాసరెడ్డి, లతిత కుమారి( టీచర్) దంపతుల పెద్ద కుమారుడు. వీరి స్వగ్రామం హనుమంతునిపాడు మండలం తాటిచెట్లవారిపల్లి. సుమారు 30 ఏళ్ల నుంచి కనిగిరిలో నివాసముంటున్నారు.
సుధీర్‌రెడ్డి భౌతికకాయానికి దద్దాల నివాళి..
బైక్ ప్రమాదంలో మృతి చెందిన ముక్కు సుధీర్ రెడ్డి భౌతికకాయాన్ని వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆదివారం రాత్రి సందర్శించి, నివాళులర్పించారు. ఘటన వివరాలు తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, మాజీ ఎంపీపీ గాయం బలరాంరెడ్డి, సూరసాని మోహన్‌రెడ్డి, గాయం ఈశ్వరమ్మ, పులి శ్రీను, యక్కంటి శ్రీను, సానికొమ్ము మధుసూదన్ రెడ్డి, జి.ఆదినారాయణరెడ్డి, గుంటక వెంకట రమణారెడ్డి, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, పిల్లి లక్ష్మీ నారాయణరెడ్డి, సైకం ఏడుకొండలరెడ్డి ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
తాత మరణంతో నెల రోజుల క్రితం స్వదేశానికి

రెండు రోజుల్లో విదేశాలకు..అంతలోనే