
ఏకల్ విద్యాలయాలతో విద్యార్థుల్లో దేశభక్తి
త్రిపురాంతకం: ఏకల్ అభియాన్ విద్యాలయాల ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలు పెంపొందిస్తున్నట్లు ఏకల్ విద్యాలయాల జిల్లా అధ్యక్షుడు డీ రాములు పేర్కొన్నారు. త్రిపురాంతకంలో ఏకల్ అభియాన్ విద్యాలయాల రాయలసీమ జిల్లాల కో ఆర్డినేటర్ల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకల్ విద్యాలయాలు దేశవ్యాప్తంగా 95 వేల గ్రామాల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో రెండు లక్షల గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా విద్యార్థుల్లో విద్యతో పాటు, దేశభక్తి, సంస్కృతి, సాంప్రదాయాలు, కుటుంబ విలువలు వంటి వాటిపై చిన్ననాటి నుంచి శిక్షణ ఇస్తారని చెప్పారు. రాయలసీమ జిల్లాలకు చెందిన 60 మంది వారం రోజుల పాటు శిక్షణలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సీపీపీ కృష్ణారావు, ఇన్‌చార్జి ఎం హనుమంతు, రాయలసీమ ఇన్‌చార్జి మల్లికార్జున్, ప్రకాశం జిల్లా ఇన్‌చార్జిలు వెంకటేశ్వర్లు నాయక్, సూర్యనారాయణ, సుబ్బారావు, హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రిపురాంతకంలో శోభాయాత్ర నిర్వహించారు.