
ఉపాధ్యాయుల రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలు
నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ఆవరణలో నవంబరు 8,9 తేదీల్లో ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా బాలోత్సవ కమిటీ అధ్యక్షుడు, ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్, ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు పేర్కొన్నారు. కోటప్పకొండరోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పల్నాడు బాలోత్సవం పిల్లల పండుగలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించిందని, అదేస్ఫూర్తితో ఈ ఏడాది పల్నాడు బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీలు నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించిందన్నారు. గౌరవ సలహాదారుడు, శ్రీకృష్ణ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ కొల్లి బ్రహ్మయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు పోటీల్లో పాల్గొని విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలన్నారు. పోటీల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు టి.అంజిరెడ్డి, గౌస్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొనేలా రూపకల్పన చేసి తమ కళలను ఆవిష్కరింప చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. పోటీలో పాల్గొనదలచిన ఉపాధ్యాయులు ఈనెల 26వ తేదీలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 98665 62260, 99498 09821 నెంబర్లలో palnadubaoltsavam@gmail. com మెయిల్ ఐడీలో సంప్రదించాలని సూచించారు.
నవంబర్ 8,9 తేదీల్లో నరసరావుపేటలో నిర్వహణ
వెల్లడించిన పల్నాడు జిల్లా
బాలోత్సవ కమిటీ సభ్యులు