
చలో విజయవాడకు తరలిరండి
నరసరావుపేట: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం మంగళవారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కార్యాలయంలో ఛలో విజయవాడ పోరుబాట కార్యక్రమ కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల చిన్నచూపు చూస్తుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే విస్మరించారన్నారు. బకాయి ఉన్న నాలుగు డీఏలను విడుదల చేసి ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి తప్పించి, బోధనకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు యాప్‌ల భారం నుంచి విముక్తి కల్పించాలని, సరెండర్ లీవ్, పీఎఫ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని ప్రభుత్వానికి పలు మార్లు యూనియన్ రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా చలో విజయవాడ పోరుబాట కార్యక్రమం చేపట్టామన్నారు. ఏపీటీఎఫ్ నాయకులు బి.ప్రజామూర్తి, నాయకులు టి.వెంకటేశ్వర్లు, డీఎన్‌ఎస్ మూర్తి, కె.రవి, సీహెచ్.నాగేశ్వరరావు, ఎం.రామాంజనేయులు, టి. నాగరాజు పాల్గొన్నారు.
యూటీఎఫ్ పల్నాడు జిల్లా
ప్రధాన కార్యదర్శి మోహనరావు
కరపత్రం ఆవిష్కరించిన నాయకులు