
వ్యవసాయ పనిముట్లపై జీఎస్టీ తగ్గింపు
చిలకలూరిపేట: వ్యవసాయ పనిముట్లు, ఎరువుల ధరలపై జీఎస్టీ తగ్గించిన విషయాన్ని రైతులు గుర్తించాలని జాయింట్ కమిషనర్ జాన్ స్టీవెన్సన్ చెప్పారు. జీఎస్టీ తగ్గింపుపై ప్రచార కార్యక్రమాన్ని కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం నిర్వహించారు. ముందుగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్ విడిభాగాలపై గతంలో ఉండే 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. ఈ విషయాలపై రైతులు పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. అనంతరం గణపవరంలో జీఎస్టీ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీదేవి, సిబ్బంది చరణ్, సునీల్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొత్తమాసు శ్రీనివాసరావు, ఆడిటర్లు టీవైవీఎల్‌ఎన్ మూర్తి, సామా శ్రీనివాసరావు, వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మురికిపూడి ప్రసాద్, రవినాయక్ పాల్గొన్నారు.