
మళ్లీ సాగునీటి సంఘాలు
మరికల్: సాగునీటి సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మళ్లీ నిర్ణయించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ విషయాన్ని ప్రకటించారు. సాగునీటి సంఘాల ఏర్పాటుతో మిషన్ కాకతీయ అధికారులకు పనిభారం తగ్గడమే కాకుండా.. నీటివనరుల పర్యవేక్షణ మెరుగుపడనుంది. ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు, ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూటరీల వారీగా నీటి వినియోగదారుల సంఘాలు ఉండేవి. ఆయా చెరువులు, ప్రాజెక్టులను వీరే పర్యవేక్షించే వారు. వాటి పరిధిలో ఏం జరిగినా అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. సత్వర పరిష్కారానికి కృషి చేసేవారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు. చెరువులు, ప్రాజెక్టుల వద్ద ఏ పని జరిగినా అధికారుల పర్యవేక్షణలోనే నిర్వహిస్తూ వస్తున్నారు. ఫలితంగా నీటి వసరుల సమస్యలు గుర్తించడంలో జాప్యం జరిగి నష్టం వాటిల్లుతోంది. అంతే కాకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదు. అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన కాల్వల్లో ఆశించిన స్థాయిలో సాగునీరు రావడం లేదు. అదే సంఘాలు ఉండి ఉంటే.. సభ్యులుగా ఉండే రైతులే అధికారుల సమన్వయంతో ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించుకునే అవకాశం ఉండేది.
2008 నుంచి ఎన్నికల ఊసెత్తని ప్రభుత్వం..
జిల్లాలో వంద ఎకరాల ఆయకట్టు, అంతకంటే ఎక్కువగా ఉన్న చెరువులు 124 ఉన్నాయి. 2006లో ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా వంద ఎకరాల ఆయకట్టు ఉన్న ప్రధాన చెరువులకు సాగునీటి సంఘాలను ఏర్పాటుచేశారు. వాటి పదవీ కాలం 2008తో ముగిసింది. అప్పటి నుంచి తిరిగి ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినా నీటి సంఘాల ఎన్నికల ఊసెత్తలేదు. గత ప్రభుత్వ హయాంలో చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పనులు చేపట్టారు. కానీ నీటి సంఘాలు లేకపోవడంతో కాంట్రాక్టర్లు తుతూ మాత్రంగా పనులు చేపట్టి చేతులెత్తేశారు. ప్రభుత్వం చెరువుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సాగునీటి సంఘాల ఎన్నికలు త్వరగా నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.
గతంలో ఇలా..
ప్రభుత్వం సాగునీటి సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగానే వంద ఎకరాల ఆయకట్టు ఉన్న ప్రధాన చెరువుల ఆయకట్టు రైతులు చైర్మన్‌తో పాటు డైరెక్టర్లను ఎన్నుకునేవారు. పాలకవర్గ సభ్యులు చెరువుల నిర్వహణతో పాటు నీటిని పంట పొలాలకు విడుదల చేసుకొని పొదుపుగా వాడుకునేలా చర్యలు తీసుకునేవారు. అంతేకాకుండా రైతులను సమన్వయ పర్చుకుంటూ అభివృద్ధి పనులు నిర్వహించే వారు. కానీ గత 15ఏళ్ల నుంచి సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించక పోవడంతో చెరువుల నిర్వహణ కొరవడింది.
15 ఏళ్లుగా జరగని ఎన్నికలు
నీటివనరులపై కొరవడిన పర్యవేక్షణ
చివరి ఆయకట్టుకు సాగునీరందక రైతుల అవస్థలు
సత్వర పరిష్కారానికి నోచుకోని సమస్యలు
సంఘాల ఏర్పాటుతోనే చెరువుల అభివృద్ధి