
కాంగ్రెస్‌లోకి మాస్ లీడర్..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపుతో పాటు దూరదృష్టితో పార్టీ బలోపేతమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ప్రధానంగా జిల్లా పరిషత్‌తో పాటు మండల పరిషత్, పంచాయతీ.. ఆ తర్వాత రానున్న కార్పొరేషన్/మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటేలా ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి పాలమూరులో అత్యధిక ఓటర్లు ఉన్న బీసీ సామాజిక వర్గంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో బీసీల్లో బలమైన వర్గానికి చెందిన ఓ కీలక నేత త్వరలో కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రేపు హైకోర్టులో విచారణ జరగనుండగా.. స్థానిక ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. అయినప్పటికీ కీలక పరిణామాలు చోటుచేసుకుంటుండడంతో జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
రాష్ట్ర రాజధానిలో మంతనాలు..
బీసీల్లో బలమైన వర్గానికి చెందిన ఆ కీలక నేతకు సీఎం రేవంత్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆ ఇద్దరూ టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో సదరు నేత బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2020 జూలైలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జడ్చర్ల లేదా నారాయణపేట నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆయనకు భంగపాటు ఎదురుకాగా.. మనస్థాపంతో కారెక్కారు. కానీ ఇప్పటివరకు ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండగా.. ఆయన తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన పలువురు ఇటీవల హైదరాబాద్‌లో సదరు బీసీ నేతతో మంతనాలు జరిపినట్లు ఆయన సామాజిక వర్గంలో ప్రచారం జరుగుతోంది.
మిడ్జిల్ మండలం.. లేదంటే..
గతంలో సదరు కీలక నేత జడ్చర్ల నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందడం.. బీసీల్లో బలమైన సామాజిక వర్గా నికి చెందిన ఆయనకు మాస్ లీడర్‌గా గుర్తింపు ఉండడం పార్టీకి కలిసి వస్తుందనే ఆలో చనతో కాంగ్రెస్‌లోని సీఎం వర్గీయులు పావులు కదిపినట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ పీఠం ప్రస్తుతం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే.. సదరు నేత భార్యకు జిల్లా పరిషత్ పీఠం కట్టబెట్టే ఆలోచనతో ఆ పార్టీ పెద్దలు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు గతంలో జెడ్పీటీసీ సభ్యుడిగా సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రా రంభించిన జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలం నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు తీర్పు మేరకు రిజర్వేషన్లలో మార్పులు ఏమైనా ఉంటే.. సదరు నేతకే రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవి కేటాయించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఒకే దెబ్బకు 2 పిట్టలు..?!
మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు మహబూబ్‌నగర్, దేవరకద్ర నియోజకవర్గాలకు చెందిన నాయకులకే నామినేటెడ్ పదవులు దక్కాయని.. జడ్చర్ల సెగ్మెంట్‌ను విస్మరించారనే ప్రచారం ఆ పార్టీలో జరుగుతోంది. ఈ క్రమంలో జిల్లా పరిషత్ పీఠం తమకే కేటాయించాలని ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు సదరు నియోజకవర్గ ముఖ్య నేత వ్యవహార శైలి ప్రభుత్వానికి, పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతోందని.. కొరకరాని కొయ్యగా మారకముందే ఫుల్‌స్టాప్ పెట్టాలని భావించిన అధిష్టానం సీఎం నిర్ణయం మేరకు బీసీల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన సదరు నేత వైపు మొగ్గుచూపినట్లు సమాచారం.
‘స్థానికం’లో గెలుపే లక్ష్యంగా పావులు
దూరదృష్టితో పార్టీ బలోపేతం దిశగా అడుగులు
హైదరాబాద్‌లో కీలక నేతల మంతనాలు
మహబూబ్‌నగర్ జిల్లాలో రసవత్తరంగా రాజకీయాలు