గెలుపు గుర్రాల వేట! | - | Sakshi
Sakshi News home page

గెలుపు గుర్రాల వేట!

Oct 7 2025 5:17 AM | Updated on Oct 7 2025 5:17 AM

గెలుపు గుర్రాల వేట!

గెలుపు గుర్రాల వేట!

అభ్యర్థుల ఎంపికపై పార్టీల సర్వేలు

ఆశావహులతో దరఖాస్తుల స్వీకరణ

పార్టీ నేతలతో సమాలోచనలు

స్థానిక ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న ప్రధాన పార్టీలు

నారాయణపేట: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో పల్లెల్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో గెలుపు గుర్రాల వేటలో ప్రధాన పార్టీలు అన్వేషణ మొదలుపెట్టాయి. స్థానిక ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో రిజర్వేషన్లు.. ఆయా సామాజిక వర్గాల బలాబలాలకు అనుగుణంగా గెలుపు గుర్రాల ఎంపికపై పార్టీల నేతలు అందరితో సమాలోచనలు.. వ్యూహరచనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నారాయణపేట కావడం.. మంత్రిగా ఉన్న వాకిటి శ్రీహరి నియోజకవర్గం మక్తల్‌ కావడంతో పాటు స్థానిక ఎన్నికల్లో తనదైన ముద్ర వేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టిసారించారు. మరోవైపు అధికార పార్టీ అభ్యర్థులను ఎదుర్కొనేందుకు బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలో దించాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ముందుకెళ్తున్నారు. అదే విధంగా బీజేపీ ఎంపీ డీకే అరుణ దిశానిర్ధేశంతో ఆ పార్టీ నాయకులు కొండయ్య, నాగూరావు నామాజీ, రతంగ్‌ పాండురెడ్డి, సత్యయాదవ్‌ సైతం గెలుపు గుర్రాలను నిలబెట్టేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు.

రిజర్వేషన్ల ఆధారంగా..

రిజర్వేషన్ల ఆధారంగా ఎవరెవరు పోటీలో ఉంటారనే దానిపై ఆశావహుల పేర్లను ఆయా పార్టీల మండల అధ్యక్షులు సేకరించి.. ముఖ్య నేతలతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులకు పంపిస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికతో సహా ఓటర్ల వద్దకు ఎలా వెళ్లాలనే అంశాలపై పార్టీల ముఖ్య నేతలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను వీలైనంత త్వరగా ఎంపికచేసే పనిలో ఉన్నారు.

అందరి నోట కోస్గి ఎంపీపీ స్థానం మాట..

సీఎం ఇలాకాలోని కోస్గి ఎంపీపీ స్థానాన్ని ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. ఈ మండలంలో 6 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వీటిల్లో ఎస్సీ మహిళలకు కేటాయించింది ఒక్కటీ లేదు. ఒక్క స్థానాన్ని మాత్రమే ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. అక్కడ మహిళకు బదులు పురుష అభ్యర్థి విజయం సాధిస్తే.. ఎంపీపీ పీఠం ఖాళీగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని రిజర్వేషన్లు ప్రకటించే సమయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే మరో రెండు జనరల్‌ స్థానాలు చంద్రవాంచ (జనరల్‌ మహిళ), సర్జఖాన్‌పేట (జనరల్‌) స్థానాల్లో సైతం ఎస్సీ మహిళను నిలబెట్టుకోవచ్చని చెప్పడంతో.. చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. మిర్జాపూర్‌, ముశ్రిఫా బీసీ జనరల్‌, తొగాపూర్‌ బీసీ మహిళకు రిజర్వు అయ్యాయి. అయితే లేక లేక జనరల్‌ స్థానం తమకు వస్తే తామేలా వదులుకుంటామంటూ ప్రధాన పార్టీల్లోని ఆశావహులు పేర్కొంటూ.. తమకు టికెట్‌ ఇవ్వాల్సిందేనని పార్టీ అధిష్టానాలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

అభ్యర్థుల జల్లెడ..

ప్రఽదానంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల్లో అభ్యర్థులను సర్వే ప్రాతిపదికన ఎంపిక చేస్తామని చెబుతున్నారు. ముందుగా ఆశావహులతో దరఖాస్తులు స్వీకరించి.. సమగ్ర సర్వే, అందరి సమాలోచనలతో అభ్యర్థులను జల్లెడ పట్టే పనిలో పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపు గుర్రాలకే టికెట్లు అనే సంకేతాలు ఇస్తున్నారు. గట్టి పోటీ ఉన్న స్థానాల్లో ఆచితూచి అడుగు వేయక తప్పడం లేదంటూ ఆశావహులకు బహిరంగంగానే చెబుతున్నారు. రిజర్వేషన్లు ఉన్న స్థానాలతో పోలిస్తే జనరల్‌ స్థానాల్లో పోటీ అధికంగా ఉంది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో గెలుపు కోసం తాము పడిన కష్టాన్ని గుర్తుచేస్తూ.. రిజర్వేషన్‌ తమకు అనుకూలమని, ఈ సారి తమకు తప్పకుండా అవకాశం ఇవ్వాలని కొందరు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్‌ ఇస్తే ఓ పంచాయితీ.. ఇవ్వకపోతే మరో పంచాయితీ వస్తుందంటూ పార్టీ ముఖ్యనేతలు తలలు పట్టుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement