
ఫిర్యాదులపై సత్వరం స్పందించాలి
నారాయణపేట: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డీఎస్పీ లింగయ్య పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముగ్గురు అర్జీదారులతో డీఎస్పీ నేరుగా ఫిర్యాదులు స్వీకరించి.. వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని డీఎస్పీ ఆదేశించారు. ప్రజలకు పోలీసుశాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధితులకు భరోసా కల్పించాలని తెలిపారు.
సీజేఐపై దాడి హేయనీయం
నారాయణపేట టౌన్: దేశంలో మతోన్మాద విద్వేష భావాజాలం పెరగడంతోనే సభ్య సమాజం తలదించుకొనే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి పాల్పడటం హేయమైన చర్యన్నారు. దేశంలో పతనమవుతున్న సామాజిక విలువలకు ఈ దాడి పరాకాష్టగా మారిందన్నారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్లు తెలిపారు.