దామరగిద్ద: జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో బీజేపీ బరిలో నిలుస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ అన్నారు. సోమవారం దామరగిద్దలో బీజేపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాల్లో బీజేపీ నాయకులు పోటీ చేసేందుకు సిద్ధం కావాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు కావలి వెంకటప్ప, సత్యనారాయణ, అబ్దుల్ నబీ, గోపాల్‌రావు, వెంకటయ్య తదితరులు ఉన్నారు.
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం
దామరగిద్ద: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేసే సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్రామారెడ్డి కోరారు. సోమవా రం మండలంలోని క్యాతన్‌పల్లిలో నిర్వహించిన పార్టీ ముఖ్యకార్యర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని గ్రామాల్లో ప్రజల మద్దతుతో స్థానిక సమరానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. అన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు కృషిచేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం నాయకులు గోపాల్, అంజిలయ్యగౌడ్ శివకుమార్, అరుణ్, నర్సింహులు, మహేశ్‌కుమార్‌గౌడ్, జోషి, రామకృష్ణ, మహమూద్ తదితరులు ఉన్నారు.
నేడు ఫుట్‌బాల్ జట్టు ఎంపిక
జడ్చర్ల టౌన్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎస్‌జీఎఫ్ అండర్–19 బాలికల ఫుట్‌బాల్ జట్టు ఎంపికలను మంగళవారం జడ్చర్లలోని మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి డా.శారదాబాయి తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే విద్యార్థులు పదో తరగతి మెమో, ఆధార్, బోనఫైడ్ జిరాక్స్‌లతో రావాలని సూచించారు. ఉదయం 9 గంటలకు మిని స్టేడియంలో రిపోర్టు చేయాలని, ఇతర వివరాలకు 9985375737 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
రేపు ఉమ్మడి జిల్లా కబడ్డీ జట్ల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్‌ఏ స్టేడియంలో బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–19 బాలబాలికల కబడ్డీ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు నాలుగు ఎలిజిబిలిటి ఫారాలతో ఉదయం 9 గంటలకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్‌కు రిపోర్టు చేయాలని ఆమె సూచించారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం.నాగరాజ్‌గౌడ్ అన్నారు. మండలంలోని ఈర్లదిన్నె, నాగల్‌కడ్మూర్, పాంరెడ్డిపల్లె, మస్తీపురం గ్రామాలలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పేదలకు అందించి ఇంటి నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు.
స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను నిర్ణయించేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానమని, అక్కడి నుంచి అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి ఆయూబ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, నాయకులు చుక్క ఆశిరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ