
విధుల్లో మినహాయింపు ఇవ్వాలి
నారాయణపేట రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఇబ్బంది ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు కల్పించాలని పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు వినతిపత్రం అందించారు. సోమవారం ఆమె ఛాంబర్‌లో కలిసి ఉపాధ్యాయ సమస్యలపై వివరించారు. గర్భిణులు, చంటి పిల్లలు ఉన్నవారు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బందులు పడుతున్న టీచర్లు, ఆరు నెలల్లో పదవీ విరమణ పొందే ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు కేటాయించకుండా చూడాలని కోరారు. శిక్షణ సైతం దసరా పండుగ తర్వాత ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు జనార్దన్ రెడ్డి, రఘువీర్ పాల్గొన్నారు.
పంట కొనుగోలుకు కపాస్ కిసాన్ యాప్
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): రైతులు పండించిన పంట కొనుగోలు కోసం ప్రభుత్వం కొత్తగా కపాస్ కిసాన్ యాప్ తీసుకువచ్చిందని మార్కెటింగ్ శాఖ రీజినల్ డైరెక్టర్ మల్లేశం అన్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులకు యాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన పత్తి పంటను అమ్ముకోవడానికి ప్రభుత్వం చాలా సులువైన పద్ధతిని అమలులోకి తెచ్చిందన్నారు. పత్తి అమ్ముకోవాలనుకునే రైతులు మూడు రోజుల ముందు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని, అందులో అనుకూలమైన తేదీ, సమయంతో యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవచ్చని, దాని ప్రకారం పత్తి కొనుగోలు కేంద్రానికి సరుకు తెచ్చి అమ్ముకోవచ్చన్నారు. దీంతో రైతులు తక్కువ సమయంతోపాటు సులువైన పద్ధతిలో పత్తిని అమ్ముకోవచ్చని చెప్పారు. ఈ విధానంపై ఏఈఓలు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ మార్కెట్ యార్డు కార్యదర్శి జయలక్ష్మి, వ్యవసాయ శాఖ ఉమ్మడి జిల్లా అధికారులు, మార్కెటింగ్ శాఖ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఫుట్‌బాల్ జట్టుకుఅభినందన
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జనగాంలో ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగిన ఎస్‌జీఎఫ్ అండర్–19 ఫుట్‌బాల్ పోటీలలో రెండో స్థానం సాధించిన మహబూబ్‌నగర్ జిల్లా బాలుర జట్టును సోమవారం కలెక్టరేట్ వద్ద డీవైఎస్‌ఓ శ్రీనివాస్, డీఐఈఓ కౌసర్‌జహాన్ అభినందించారు. వీరితోపాటు ఎస్‌జీఎఫ్ అండర్–19 ఇన్‌చార్జ్ కార్యదర్శి శారదాబాయి, పెటా టీఎస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌గౌడ్, సీనియర్ పీఈటీ వేణుగోపాల్ జట్టులోని క్రీడాకారులను అభినందించారు.