
పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి
నారాయణపేట: రోజుల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రాపర్టీ నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ యోగేష్‌గౌతమ్ ఆదేశించారు. బుధవారం పోలీస్ అధికారులతో ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. కేసు నమోదైన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా నిందితులను అరెస్టు చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణపై తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ విధులు నిర్వహించాలన్నారు. దొంగతనాల నివారణ, ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రాత్రి సమయాల్లో బ్లూ కోర్డ్స్, పెట్రో కార్ అధికారులు, సిబ్బంది నిరంతరంగా విధులు నిర్వహించాలని, డయల్ 100 కాల్స్‌పై అలసత్వం వహించవద్దన్నారు. డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్‌తోపాటు శివశంకర్, రామ్ లాల్, రాజేందర్ రెడ్డి, సైదులు పాల్గొన్నారు.