
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..
కోస్గి రూరల్: స్థానిక పురపాలికను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కడా చైర్మన్ వెంకట్‌రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి తెలిపారు. మంగళవారం పురపాలికలో రూ.1.32 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ, పలు కార్యాలయాల ప్రారంభోత్సవాలు నిర్వహించి మాట్లాడారు. అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.350 కోట్లు కేటాయించామని.. పనులు సైతం వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఇంజినీరింగ్, మహిళా డిగ్రీ కళాశాల తరగతులు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయని.. ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకొనే విద్యార్థులకు మంచి అవకాశమని వివరించారు. రూ.40 లక్షలు కడా నిధులతో ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు, రూ.30 లక్షలతో విద్యుత్ సబ్‌డివిజన్ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో రూ.35 లక్షలతో మార్చురీ గది, రూ.12 లక్షలతో ఆస్పత్రికి ప్రహరీ, రూ.15 లక్షలతో రోగుల నిరీక్షణకు హాల్ నిర్మాణానికి భూమిపూజ చేపట్టారు. అనంతరం ఆస్పత్రిలో పర్యటించి రోగులతో మాట్లాడారు. రోగులకు నిరంతరం వైద్యసేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి గోవిందరాజు, డిప్యూటీ ఈఈ విలోక్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, మండల విద్యాధికారి శంకర్‌నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్, పుర అధ్యక్షుడు బెజ్జు రాములు, పట్టణ అధ్యక్షుడు తుడుం శ్రీనివాసులు, పీఏసీఎస్ అధ్యక్షుడు భీంరెడ్డి, వైద్యులు అనుదీప్, నాగులపల్లి నరేందర్, అన్నకిష్టప్ప, మాస్టర్ శ్రీనివాస్, బాలేష్, భానునాయక్ తదితరులు ఉన్నారు.