
ఈత వనాలెక్కడ..?
మరికల్: కల్తీ కల్లును పూర్తిగా నివారించేందుకు గత ప్రభుత్వం హరితహారం (వన మహోత్సవం)లో ఈత వనాలను నాటించింది. అవి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఉన్న మొక్కలు కూడా ఎదుగుదల లేక గిడుగుబారి పోతున్నాయి. ప్రభుత్వం వివిధ రకాల మొక్కలను ప్రత్యేకంగా తెప్పించి నాటించినా నిర్వహణ కొరవడుతోంది. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. జిల్లాలో ఈత వనాల విస్తీర్ణం తక్కువ. ఈ నేపథ్యంలో ఏటా ఈత మొక్కలు నాటించే కార్యక్రమం చేపడుతున్నారు. మూడేళ్ల కాలంలో 1,15,900 మొక్కలు నాటారు. అందులో 10శాతం కూడా కనిపించడం లేదు. వాగులు, వంకల పక్కనున్న ఈతచెట్లను కొందరు క్రమేణా తొలగించి సాగు భూములుగా మార్చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్తగా నాటిన మొక్కలను సైతం తొలగిస్తున్నట్లు తెలిసింది. అయితే మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ఎవరిదన్నది కూడా తెలియని దుస్థితి నెలకొంది.
సమన్వయ లోపం..
ఈత మొక్కలు నాటే కార్యక్రమం ఎకై ్సజ్‌శాఖ పర్యవేక్షణలో కొనసాగుతోంది. వారు నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత డీఆర్డీడీఏ పరిధిలో గ్రామపంచాయతీలు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తమ శాఖ పరిధిలో విధించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటడం మాత్రమే తమవంతు అని.. సంరక్షించే బాధ్యత పంచాయతీల వంతు అనే విధంగా అధికారుల వ్యవహార తీరు కనిపిస్తోంది. ఫలితంగా మొక్కల దశలోనే ఈత వనాలు కనిపించకుండా పోతున్నాయి. ఉన్న మొక్కలు సైతం సంరక్షణకు నోచుకోవడం లేదు.
కల్తీ కల్లే దిక్కు..
ఈత వనాలు విరివిగా పెంచి నీరా దుకాణాలు తెరిపిస్తామని అప్పటి ఆబ్కారీశాఖ మంత్రి ప్రకటించా రు. అయితే జిల్లావ్యాప్తంగా ఉన్న నీరా దుకాణాల ను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఎక్కడ చూసినా కల్తీ కల్లు దుకాణాలే కనిపిస్తున్నాయి. సీహెచ్, డైజోఫాం, అల్ఫ్రాజోలం లాంటి మత్తు పదార్థాలతో కల్లు తయారీ చేసి విక్రయిస్తున్నారు. గ్రామాల్లో కల్తీ కల్లు తాగి ఆరోగ్యం పాడుచేసుకుంటున్న పరిస్థితి ఉంది. జిల్లావ్యాప్తంగా ఎక్కడో ఒక చోట కల్తీ కల్లు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కొన్ని వెలుగు చూడ టం లేదు. వీటిని ఈత వనాల పెంపుతోనే అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి.
పరిరక్షణకు చర్యలు..
జిల్లాలో నాటిన ఈత వనాలను పరిశీలించి పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. ఇందుకు డీఆర్డీఏ, పంచాయతీరాజ్ శాఖల సహకారం తీసుకుంటాం. ప్రభుత్వం ఆదేశిస్తే మళ్లీ ఈత మొక్కలు నాటేందుకు అవసరమైన భూములను గుర్తిస్తాం.
– అనంతయ్య, ఎకై ్సజ్ సీఐ, నారాయణపేట
నిర్వహణ లేక మొక్కలు కనుమరుగు
జిల్లాలో 1.15లక్షల
ఈత మొక్కలు నాటిన ఆబ్కారీశాఖ
క్షేత్రస్థాయిలో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్న వైనం
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం

ఈత వనాలెక్కడ..?