
రైతులకు తప్పని యూరియా కష్టాలు
నారాయణపేట టౌన్/మరికల్/కొత్తపల్లి: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఒక్క బస్తా యూరియా కోసం నిత్యం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం–2కు వివిధ గ్రామాల నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి బారులు తీరారు. కొందరు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. చివరకు చాలా మంది రైతు లకు యూరియా లభించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
● మరికల్‌లో టోకెన్ల కోసం రైతులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 700 బస్తాల యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్యూ కట్టారు. అయితే రైతువేదిక వద్ద టోకెన్లు ఇస్తున్నారని సిబ్బంది చెప్పడంతో అక్కడికి పరుగులు పెట్టారు. కానీ అక్కడ టోకెన్లు ఇవ్వడం లేదని తెలుసుకొని ఏఓ రహ్మన్‌ను నిలదీశారు. వెంటనే తమకు టోకన్లు ఇచ్చి యూరియా అందించాలని ఆందోళనకు దిగారు. అయితే వారం రోజుల క్రితం టోకెన్లు పొందిన వారికి యూరియా పంపిణీ చేస్తున్నామని.. మిగతా వారికి రెండు రోజుల్లో అందజేస్తామని ఏఓ నచ్చజెప్పారు.
● కొత్తపల్లి మండల కేంద్రంలోని హాకా ఎరువుల దుకాణం వద్ద రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. దుకాణం తెరిచిన తర్వాత టోకెన్ల పంపిణీ చేపట్టగా.. రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను క్యూలో నిలబెట్టారు. ఏఓ రమేశ్, సిబ్బందితో కలిసి మొత్తం 300 బస్తాల యురియాను ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. చాలా మంది రైతులకు యూరియా లభించలేదు. వారికి టోకెన్లు అందజేశారు. మంగళవారం మరో లారీ యూరియా వస్తుందని.. రైతులందరికీ అందజేస్తామని ఏఓ తెలిపారు.

రైతులకు తప్పని యూరియా కష్టాలు

రైతులకు తప్పని యూరియా కష్టాలు