
పేట ఎత్తిపోతల పథకానికి భూ సర్వే
ఊట్కూరు: మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆదివారం నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో భూ సర్వే చేపట్టడంతో రైతులు అయోమయానికి గురయ్యారు. నెల రోజుల క్రితం సర్వే చేపట్టి రైతులకు నోటీసులు ఇచ్చారు. దీంతో తమ భూములు పోలేదని చాలా మంది రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆదివారం ఉదయం మరోసారి అధికారులు రైతులు సమాచారం ఇవ్వకుండా దంతన్‌పల్లి శివారులో రిజర్వాయర్ కట్ట నిర్మాణం కోసం సర్వే చేపట్టారు. దీంతో రైతులు అధికారులను నిలదీశారు. గతంలో సర్వే పూర్తి చేశామని అధికారులు తెలిపారని, మళ్లీ సర్వే చేపట్టడం వల్ల భూములు కోల్పోవాల్సి వస్తుందని రైతులు అనిల్, వీరేష్‌గౌడ్, నరేష్‌గౌడ్ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో సర్వేకు సంబంధించి ముంపునకు గురవుతున్న భూమి వివరాలను రైతులకు తెలుపకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు ఎత్తిపోతల పథకంపై పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు.