
మోదీతోనే దేశ సమగ్రాభివృద్ధి
నారాయణపేట రూరల్: 11 ఏళ్లుగా మోదీ నాయకత్వంలో భారతదేశం సమగ్ర అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో శనివారం నిర్వహించిన సేవా పక్వాడా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి, బీజేపీ జెండాను ఆవిష్కరించి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో శుభ్రతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతి వార్డులో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రధానమంత్రి మోదీ జన్మదినం పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు జరుగుతున్న సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా శుభ్రతపై సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని ఆమె తెలిపారు. సెప్టెంబర్ 25న పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మేధావుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
కోటకొండలో వైద్య శిబిరం
కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన స్వస్థ నారీ శక్తిశాలి కుటుంబం గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని, ఈ ప్రాంత మహిళలకు కోటకొండలో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధాని మోదీ ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతున్నారని, ప్రజలు పార్టీలకు అతీతంగా కలిసి గ్రామీణాభివృద్ధి, జాతీయ పురోగతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం తిరుమల దేవునిపల్లిలో స్వామివారిని దర్శించుకున్నారు. పట్టణంలోని వేంకటేశ్వర స్వామి రజత విగ్రహం శోభాయాత్రలో ఎంపీ డీకే అరుణ పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రతంగ్ పాండురెడ్డి, నాయకులు పడుకుల శ్రీనివాసులు, కెంచె శ్రీనివాస్, మండల అధ్యక్షురాలు జ్యోతి, సాయిబన్న, లక్ష్మి, ప్రవీణ్, రవి కార్యకర్తలు పాల్గొన్నారు.