ప‌ప్పుశ‌న‌గ సాగుపై నీలినీడ‌లు | - | Sakshi
Sakshi News home page

ప‌ప్పుశ‌న‌గ సాగుపై నీలినీడ‌లు

Oct 7 2025 4:27 AM | Updated on Oct 7 2025 2:25 PM

అందుబాటులో లేని రసాయన ఎరువులు

అందని సబ్సిడీ విత్తనాలు

వెంటాడుతున్న వర్షాలు

ముందుకు సాగని పనులు

అటు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం.. ఇటు అనుకూలించని వాతావరణంతో పప్పుశనగ సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఏటా రబీ సీజన్‌ మొదటి పంటగా జిల్లాలో విస్తారంగా పప్పుశనగ సాగు చేసే రైతులకు ఆదిలోనే అవరోధాలు ఎదురవుతున్నాయి. 

కోవెలకుంట్ల: అక్టోబర్‌ మాసం ప్రారంభంతో రబీ సీజన్‌ షురూ అయ్యింది. పప్పుశనగ సాగుకు సరైన అదును. జిల్లాలోని 29 మండలాల పరిధిలో జేజే–11, ఫూలేజి రకాలకు చెందిన శనగ సాగు సాధారణ విస్తీర్ణం 57,299 హెక్టార్లు. ఇందులో స్థానిక వ్యవసాయ సబ్‌ డివిజన్‌లోని కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల్లో అత్యధికంగా 38,900 హెక్టార్లలో శనగ సాగు కావాల్సి ఉంది. అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురుస్తున్న వర్షాలు, రసాయన ఎరువులు అందుబాటులో లేకపోవడం. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు సబ్సిడీ విత్తనాలను సరఫరా చేయకపోవడంతో విత్తన ప్రక్రియ ముందుకు సాగడం లేదు. 

గత నెల 20వ తేదీ నుంచి ఒకటి రెండు, రోజుల వ్యవధిలో వరుసగా వర్షాలు కు రుస్తుండటంతో నీరు నిల్వ చేరి పొలాలు బీళ్లు అయ్యాయి. ఈ నెల మొదటి వారం సాగుకు అనుకూలంగా ఉంటుందనుకున్నా రైతులకు నిరాశే మిగిలింది. వర్షాలు వీడకపోవడంతో సాగు ముందుకు సాగడం లేదు. వర్షాల కారణంగా పొలాల్లో పిచ్చిమొక్కలు, కలుపు పెరిగి బీళ్లను తలపిస్తున్నాయి. ప్రతి ఏటా దసరా పండుగ ముగిసిన వెంటనే విత్తనా లు వేసే వారు. ఈ ఏడాది దసరా పండుగ ముగిసినా విత్తనానికి పొలాలు సిద్ధం చేసుకులేని పరిస్థితి తలెత్తింది. పొలాల్లో తేమ శాతం ఆరేందుకు మరో వారం రోజులపాటు గడువు పట్టేలా ఉండటం, అల్పపీడన ప్రభావంతో తిరిగి వర్షాలు కురిసే ఆస్కారం ఉండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు.

గతేడాది కుదేలు

గత ఏడాది విత్తన సమయంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. వరణుడిపై భారం వేసి రైతులు విస్తారంగా శనగ పంట సాగు చేశారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 51 వేల హెక్టార్లలో శనగ సాగు సాధారణ విస్తీర్ణం కాగా 52 వేల హెక్టార్లలో రైతులు జేజే–11, ఫూలేజీ రకాలకు చెందిన శనగ పంట సాగుచేశారు. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు నివారణ, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 20 వేలు వెచ్చించారు. కౌలు రైతులపై కౌలు రూపంలో అదనంగా మరో రూ. 15 వేలు భారం పడింది. 

పంట మార్పిడి విధానం అవలంభించకపోవడం, విత్తన సమయంలో పొలాలను కలియదున్నక పోవడం, వాతావరణం అనుకూలించకపోవడం, తదితర కారణాలతో శనగ పైరును వేరుకుళ్లు (ఎండు తెగులు) ఆశించి పైరులో మొక్కలు ఎండిపోయాయి. ఫూలేజి (తెల్లశనగ) రకానికి చెందిన పైరుకు ఎక్కువశాతం ఎండు తెగులు ఆశించింది. తెగులుకు తోడు గత నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో తుపాన్ల ప్రభావంతో కురిసిన వర్షాలు, అధిక తేమ కారణంగా పైరు దెబ్బతినింది. వేలాది రూపాయాలు పెట్టుబడులు వెచ్చించగా అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా దెబ్బతిని ఎకరాకు 3– 4 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాకపోడంతో రైతులు నష్టాల ఊబిలో కూరకపోయారు.

ఈ ఏడాది ఆరంభంలోనే అడ్డంకులు..

జిల్లాలో ఈ ఏడాది పప్పుశనగ సాగుకు సరైన అదును కాగా సాగుకు అడ్డంకులు వేధిస్తున్నాయి. విత్తనానికి ముందు రైతులు ఎకరాకు రెండు బస్తాల డీఏపీ ఎరువులను భూమిలో వేయాల్సి ఉంది. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులను యూరియా కష్టాలు వేధించగా ఈ సీజన్‌లో డీఏపీ కష్టాలు తప్పడం లేదు. జిల్లాలోని ఆయా మండలాల్లో రైతులు గత కొన్నేళ్ల నుంచి శనగ పంటకు గోదావరి డీఏపీని విరివిగా వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ రకం డీఏపీ అందుబాటులో లేదు. రైతు సేవా కేంద్రాలు, మనగ్రోమోర్‌ కేంద్రాల్లో, సహకార పరపతి సంఘాల్లో గోదావరి డీఏపీ దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం బస్తా రూ. 1,430కు రైతులకు అందాల్సి ఉంది. దీన్ని ఆసరా చేసుకుని కొందరు ప్రైవేట్‌ డీలర్లు గోదావరి డీఏపీని అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అలాగే జిల్లాకు 11,950 క్వింటాళ్ల సబ్సిడీ శనగలను ప్రభుత్వం కేటాయించింది. క్వింటాకు రూ. 7,800 ప్రభుత్వం ధర నిర్ణయించగా 25 శాతం సబ్సిడీతో రైతులకు రూ. 5,850 ప్రకారం సరఫరా చేయాల్సి ఉంది. విత్తన కేటాయింపులు తప్పా ఇప్పటి వరకు విత్తనాలు సరఫరా కాకపోవడంతో రైతులు విత్తనాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది.

రసాయన ఎరువులు దొరకడం లేదు 

ఈ ఏడాది 65 ఎకరాల సొంత పొలంతోపాటు ఎకరాకు రూ. 20 వేలు కౌలు చెల్లించి మరో పదిహేను ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. మొత్తం 80 ఎకరాల్లో తెల్ల, ఎర్ర శనగ సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. గోదావరి డీఏపీ దొరకడం లేదు. ఇతర రకాలకు చెందిన డీఏపీ వేద్దామనుకున్నా రైతుసేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది ఎరువులు ఇవ్వడం లేదు.

– గోవిందరెడ్డి, రైతు, గుంజలపాడు, కోవెలకుంట్ల మండలం

50 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలి

ఈ ఏడాది పప్పు శనగ సాగుకు ప్రభుత్వం 25 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలను సరఫరా చేస్తోంది. క్వింటా రూ. 7,800 ధర నిర్ణయించి రూ. 5,850 ప్రకారం పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మూడు ఎకరాల సొంత పొలంలో ఈ ఏడాది శనగ సాగు చేయాలనుకుంటున్నాను. ప్రస్తుత మార్కెట్‌ క్వింటా రూ. 6 వేలలోపు ధర ఉంది. 25 శాతం సబ్సిడీ ఇచ్చినా మార్కెట్‌ధర ప్రకారం శనగలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. 50 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలు సరఫరా చేసి ఆదుకోవాలి.

– సుబ్బరాయుడు, రైతు, కోవెలకుంట్ల

సబ్‌ డివిజన్‌ సాధారణ సాగు విస్తీర్ణం విత్తన కేటాయింపులు

(హెక్టార్లలో) (క్వింటాళ్లలో)

కోవెలకుంట్ల 38,900 7,900

నంద్యాల 5,000 2,125

ఆళ్లగడ్డ 4,747 500

ఆత్మకూరు 1,310 250

నందికొట్కూరు 6,772 1,000

డోన్‌ 570 175

జిల్లాలో 57,299 హెక్టార్లలో 

సాగు లక్ష్యం

 

అటు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం.. 1
1/2

పప్పుశనగ సాగుపై నీలినీడలు

అటు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం.. ఇటు అనుకూలించని వాతావ2
2/2

పప్పుశనగ సాగుపై నీలినీడలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement