
హృదయ విదారకం
కొలిమిగుండ్ల: చిన్నా .. పెద్దా వయస్సు తేడా లేకుండా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయనేందుకు ఈ వ్యక్తి ఆకస్మిక మరణమే మరో నిదర్శనం. 35 ఏళ్ల వ్యక్తి గుండె ఆగిపోయింది. ఆరోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళ్లేందుకు బస్టాప్‌లో బస్సు కోసం వేచి ఉన్న వ్యక్తి అందరూ చూస్తుండగానే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సోమవారం కొలిమిగుండ్లలో చోటు చేసుకుంది. గొర్విమానుపల్లెకు చెందిన చెన్నయ్య(35) జీవనోపాధి కోసం నెల రోజుల నుంచి కొలిమిగుండ్లలోని మోడల్ స్కూల్ సమీపంలోని కాలనీలో ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం గ్యాస్ ట్రబుల్ సమస్య అంటూ తాడిపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. బైక్‌లో వస్తుండగా మార్గమధ్యలో కిందపడిపోయాడు. స్థానికులు సపర్యలు చేయడంతో కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. నంద్యాల సమీపంలోని ఆసుపత్రికి వెళ్లేందుకు సోమవారం కాలనీలోని ఓ వ్యక్తి సాయంతో బైక్‌పై తహసీల్దార్ కార్యా లయం సమీపంలోని బస్టాప్ వద్దకు వచ్చాడు. వెనుక భార్య రమాదేవి, తల్లి నడిచి వస్తున్నారు. కూర్చున్న చోట మరొక వ్యక్తితో మాట్లాడుతుండగానే చెన్నయ్య కు గుండెపోటు రావడంతో కుప్పకూలి మృతి చెందాడు. ఈలోగా భార్య, తల్లి అక్కడికి చేరుకుని బోరున విలపించారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నా రు. కుటుంబీకుల రోదన పలువురిని కలిచివేసింది.