
ఆశలు నీట మునిగి.. కన్నీళ్లు మిగిలి!
● కుండపోత వర్షం
● నీట మునిగిన పంటలు..
తడిచిన దిగుబడులు
● లబోదిబోమంటున్న రైతన్నలు
హరినగరం సమీపంలో ఆరబెట్టిన మొక్క జొన్నలు తడిచిన దృశ్యం
చిత్రేనిపల్లె సమీపంలో మొక్కజొన్న పొలంలో నుంచి పారుతున్న వాన నీరు
రుద్రవరం: అన్నదాతలను వరుణుడు ముంచేస్తున్నాడు. భారీ వర్షాలకు చేతికొచ్చిన పంటలు నీటి పాలవుతున్నాయి. 20 రోజులుగా కురిసిన వరుణుడు ఇక తెరిపి ఇచ్చాడులే అనుకుంటున్న తరుణంలో కుండపోత వర్షంతో రైతులు కుదేలయ్యారు. రుద్రవరం, చాగలమర్రి, దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు ఉప్పొంగాయి. పంట పొలాల్లో నీళ్లు నిలిచాయి. మొక్కజొన్న రైతులకు కోలుకోలేని దెబ్బ పడింది. గత 20 రోజులుగా కురుస్తున్న వర్షం మూడు రోజులుగా తెరిపి ఇవ్వడంతో మండల కేంద్రమైన రుద్రవరం, టీ.లింగందిన్నె, ఆలమూరు, నర్సాపురం, అప్పనపల్లె, ఎల్లావత్తుల, కోటకొండ, ముకుందాపురం, హరినగరం, నక్కలదిన్నె, ముత్తలూరు తదితర గ్రామాల పరిధిలో మొక్కజొన్న కోతలు జోరుగా సాగాయి. దిగుబడులను ఆర్‌అండ్‌బీ రోడ్లు, కల్లాలు, బయలు ప్రదేశాల్లో ఆరబెట్టారు. హఠాత్తుగా వర్షం కురవడంతో ఆరబోసిన మొక్క జొన్నలు తడిచిపోవడంతో రైతులు నష్టపోయారు. ఆలమూరు వద్ద ఉన్న దొన్ల వాగుపై నీరు ఉద్ధృతంగా పారుతోంది. భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల వద్ద వరి, మొక్కజొన్న, మిర్చి, మినుము, వేరుశనగ వంటి పంటలు నీట మునిగాయి. అలాగే మండల కేంద్రమైన రుద్రవరంతో పాటు పలు గ్రామాల్లోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి.
దొర్నిపాడు మండలంలో..
పత్తి, మినుము, కంది, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. పొలాల్లో తేమ శాతం అధికం కావడంతో ఈ పంటలన్నీ నీరుకుట్టు తీసుకుంటున్నాయని రైతులు వాపోతున్నారు. ఇటీవలే విత్తనపత్తి క్రాసింగ్ పనులు మొదలు కావడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పింజలన్నీ నేలరాలుతున్నాయి. కుందూ పరీవాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సుభద్ర హెచ్చరించారు.
జిల్లాలో మళ్లీ వర్షం
నంద్యాల(అర్బన్): జిల్లాను వరుణుడు వీడటం లేదు. మూడు రోజులు తెరిపి ఇచ్చి మళ్లీ కురిశాడు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. చాగలమర్రి మండలంలో అత్యధికంగా 75.2 మి.మీ, వెలుగోడు మండలంలో అత్యల్పంగా 3.0 మి.మీల వర్షపాతం నమోదైంది. అదే విధంగా రుద్రవరంలో 70.2, పాములపాడు 43.6, జూపాడుబంగ్లా 43.2,ఆళ్లగడ్డ 33.6, దొర్నిపాడు 30.4, శిరువెళ్ల 19.2, పగిడ్యాల 14.4, ఉయ్యాలవాడ 10.0, కోవెలకుంట్ల 3.4 మి.మీల వర్ష పాతం నమోదైంది. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
ముత్యాలపాడులో మొక్కగింజలను నీళ్లలో నుంచి బయటకు తీస్తున్న మహిళా రైతు
భారీ వర్షం.. అపార నష్టం
చాగలమర్రి: భారీ వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలో 75.2 మి.మీ వర్షపాతం నమోదైంది. గొడిగనూరు, శెట్టివీడు గ్రామాల వద్ద భవనాశి, అడ్డువాగులు ఉద్ధృతంగా ప్రవహించాయి. బ్రాహ్మణపల్లె వద్ద వక్కిలేరు వాగు వంతెన మీదుగా ప్రవహించింది. ముత్యాలపాడు చెరువు నిండి అలుగు ఎక్కి పారడంతో గ్రామం జలమయమైంది. స్థానిక ఎస్పీజీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆరబెట్టిన మొక్కజొన్న గింజలు తడిచి పోయాయి. దిగుబడులను కాపాడుకునేందుకు రైతులు పాట్లు అన్నీ ఇన్నీ కావు. కళ్ల ముందు కష్టమంతా నీటి పాలవుతుండటంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆశలు నీట మునిగి.. కన్నీళ్లు మిగిలి!

ఆశలు నీట మునిగి.. కన్నీళ్లు మిగిలి!

ఆశలు నీట మునిగి.. కన్నీళ్లు మిగిలి!