
పీజీఆర్‌ఎస్‌లో అర్జీల వెల్లువ
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై ప్రజలు వినతులు అందజేశారు. 222 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించారు. ఎక్కువగా భూ సమస్యలు, రీ సర్వేపై వినతులు వచ్చాయి. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో డీఆర్‌ఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరించా రు. అంతకుముందు జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలు నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాల్సినవి 2,017, రీఓపెన్ అయిన దర ఖాస్తులు 539 ఉన్నాయని, వాటిని గడువు ముగిసే వరకు వేచి చూడకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఫీడ్ బ్యాక్ స్వీకరణ తక్కువ శాతం ఉందని వేగవంతం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని సంక్షేమ హాస్టళ్లు, సీ్త్ర శిశు సంరక్షణ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత క్షేత్రాధికారులు తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
వినతుల్లో కొన్ని..
● గోస్పాడు మండలం ఎం.చింతకుంట్ల గ్రామంలో సర్వే నెం.247, 232లో అనుభవంలో ఉన్న భూమిని కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నానని, ఆ భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించాలని కోరుతూ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు వినతి పత్రం అందజేశారు.
● ఆళ్లగడ్డ మండలం జి.జంబులదిన్నె గ్రామంలో సర్వే నెం.328/ఎ2లో రెండు ఎకరాలు, సర్వే నెం.328/బి2లో 0.40 ఎకరాలు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నానని, కానీ ఆన్‌లైన్‌లో 2.20 ఎకరాలు మాత్రమే చూపుతోందని అందుకు తగు చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన బి.శ్రీరామ్ అర్జీ ఇచ్చారు.
● తన భర్త అనారోగ్యంతో మృతి చెందారని జీవనోపాధి కోసం వితంతు పింఛన్ మంజూరు చేయాలని పాణ్యం ఎస్సీ కాలనీకి చెందిన నెరవాటి పుల్లమ్మ వినతి పత్రం అందజేశారు.