
స్వచ్ఛ జిల్లాకు అందరూ సహకరించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: స్వచ్ఛ జిల్లాకు ప్రజలందరూ సహకరిస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. సోమ వారం పీజీఆర్‌ఎస్ హాల్‌లో నిర్వహించిన స్వచ్ఛాంధ్రా అవార్డ్స్–2025 జిల్లా స్థాయి బహుమతుల ప్రదాన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే మూడు నెలల్లో స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దాలని, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార ప్రదేశాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలని, తడి, పొడి వ్యర్థాలను వేరుగా వర్గీకరించేందుకు శ్రీకారం చుట్టాలని, మెప్మా, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలోని మహిళా స్వచ్ఛంద సమూహాల ద్వారా ఇంట్లోనే కంపోస్ట్ తయారీని ప్రోత్సహించాలని, నీటి మట్టాలు తగ్గిపోయిన 165 గ్రామాల్లో భూగర్భ జలాలను పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని కలెక్టర్ తీర్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 24 పర్యాటక కేంద్రాల పరిసరాలు ఆహ్లాదకరంగా మార్చాలన్నారు. స్వచ్ఛ ఆంధ్రా అవార్డ్స్–2025లో రాష్ట్ర స్థాయిలో ‘మన ఊరు మన గుడి మన బాధ్యత‘ స్వచ్ఛంద సంస్థ అవార్డు లభించిందని తెలిపారు. జిల్లాలో వివిధ విభాగాల్లో మొత్తం 51 అవార్డులు సాధించిన నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మెమొంటోలు, సర్టిఫికెట్లు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేసి, వారిని శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, డీపీవో లలితాబాయి, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, నంద్యాల ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తక్ అహ్మద్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.