
ముగిసిన అహోబిల పవిత్రోత్సవాలు
ఆళ్లగడ్డ: ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. ఆదివారం తెల్లవారు జామున ప్రారంభమైన పూజలు సోమవారం ఉదయం పూర్ణాహుతితో ముగిశాయి. ముందుగా మూలమూర్తులు జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మీ అమ్మవార్లను సుప్రభాతసేవతో మేల్కొలిపి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జ్వాలా నరసింహుడిని యాగశాలలో కొలువుంచి నవకళశాలతో అభిషేకించి నూతన పట్టు పీతాంబరాలతో అలంకరించి పవిత్ర హోమం నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం, రాత్రి నిత్యపూజ అనంతరం శాంతి హోమాలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, అర్ధరాత్రి అనంతరం ఉత్సవమూర్తులైన స్వామి అమ్మవార్లకు తిరుమంజనం, సంప్రోక్షణ చేపట్టారు. సోమవారం తెల్లవారు జామున శాత్తుమురై గోష్టితో పవిత్రోత్సవ కార్యక్రమాన్ని ముగించారు. ఆయా కార్యక్రమాలను అహోబిలం ప్రధానార్చకులు శ్రీమాన్ శఠగోప వేణుగోపాలన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన వేద పాఠశాలల పండితులు నిర్వహించారు.