కష్టాలే పెట్టుబడి.. నష్టాలే దిగుబడి! | - | Sakshi
Sakshi News home page

కష్టాలే పెట్టుబడి.. నష్టాలే దిగుబడి!

Oct 4 2025 12:39 PM | Updated on Oct 4 2025 12:39 PM

కష్టాలే పెట్టుబడి.. నష్టాలే దిగుబడి!

కష్టాలే పెట్టుబడి.. నష్టాలే దిగుబడి!

జిల్లాలో మొక్కజొన్న సాగు వివరాలు

కోవెలకుంట్ల: మొక్కజొన్న సాగుతో గతేడాది నష్టాలు చవి చూసిన రైతులకు ఈ ఏడాది సాగు కలిసి రాలేదు. గత ఖరీఫ్‌లో చోటు చేసుకున్న నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ ఏడు లక్ష్యాన్ని మించి సాగు చేసినా నిరాశే మిగిలింది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 54,150 హెక్టార్లలో మొక్కజొన్న సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల పరిధిలో 55,408 హెక్టార్లలో సాగైంది. విత్తనానికి ముందు విస్తారంగా వర్షాలు కురియడంతో సాగుకు అనుకూలంగా మారింది. బోర్లు, బావులు, చెరువులు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌, తదితర సాగు నీరు వనరులు అందుబాటులో ఉండటంతో లక్ష్యానికి మించి సాగైంది. విత్తనం వేశాక వరణుడు ముఖం చాటేయడం, పైరు వివిధ దశల్లో తెగుళ్లు, పుప్పడి దశలో వేసవిని తలపించేలా ఎండలు, పంట చేతికందే తరుణంలో అధిక వర్షాలు మొక్కజొన్న రైతులను వెంటాడటంతో రైతులు కుదేలయ్యారు. జిల్లాలో ప్రస్తుతం మొక్కజొన్న కోత, నూర్పిడి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

నష్టాల మూట!

గత ఏడాది జిల్లాలోని 29 మండలాల పరిధిలో 45,200 హెక్టార్లలో మొక్కజొన్న సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల్లో 54 వేల హెక్టార్లలో సాగు చేశారు. 105 నుంచి 110 రోజులు పంటకాలం కాగా పైరు ఆరంభంలో వర్షాభావం, పంట చేతికందే తరుణంలో తుఫాన్‌ వెంటాడి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. పైరు కంకిదశలో ఉండగా గత ఏడాది అక్టోబర్‌ నెలలో తుఫాన్‌ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి పంట దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 25వేల నుంచి రూ. 30 వేలు వెచ్చించారు. ఎకరాకు 22 నుంచి 30 క్వింటాళ్లలోపే దిగుబడులు రావడంతో నష్టాల ఊబిలోకూరకపోయారు. మార్కెట్‌లో క్వింటా రూ. 2,200 మించి పలకపోవడంతో నష్టాలు మూటగట్టుకున్నారు. ఈ ఏడాది మిరపకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు చేసినా రైతులకు కష్టాలు తప్పలేదు.

క‘న్నీటి’కష్టాలు

ఈ ఏడాది కోటి ఆశలతో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు విత్తనం వేసినప్పటి నుంచి అష్టకష్టాలు తప్పలేదు. తొలుత సాగునీటిని మళ్లించుకునేందుకు అవస్థలు పడ్డారు. ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌, కుంటలు, చెరువులకు డీజల్‌ ఇంజిన్లు అమర్చుకుని ఐదు నుంచి ఏడు తడులు సాగునీటిని అందించారు. ఒక్కో తడి సాగునీటి మళ్లింపుకు డీజిల్‌ ఇంజిన్లు, పైపులు, డీజల్‌, కూలీ ఖర్చుల రూపంలో రూ. 5 వేలు అదనపు భారం పడింది. వర్షాభావానికి తోడు పైరు పుప్పడి దశలో వేసవికాలాన్ని తలపించేలా ఎండలు మండటంతో మొక్కజొన్న కంకి కట్టక దిగుబడులపై ప్రభావం చూపింది. వీటికి తోడు కొన్ని చొట్ల పైరుకు ఎండు తెగులు, కత్తెర పురుగు ఆశించడంతో వాటి నుంచి పైరును కాపాడుకునేందుకు రైతులు వ్యయ ప్రయాసలు ఎదుర్కొన్నారు. ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయనుకుంటే వర్షాభావం, పుప్పడి రాలిపోడం, తెగుళ్లతో ఎకరాకు 20 నుంచి 22 క్వింటాళ్లకే దిగుబడులు పరిమితమయ్యాయి. కోత, నూర్పిడి పనులు ప్రారంభం కాగా అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురుస్తున్న వర్షాలతో రైతులు అల్లాడిపోతున్నారు. రోడ్లపై, కల్లాల్లో ఆరబెట్టిన దిగుబడులు తడిచి పోతుండటంతో వర్షానికి పైరు నేలవాలడంతో రైతులకు వరుస కష్టాలు తప్పలేదు. వేలాది రూపాయలు పెట్టుబడుల రూపంలో వెచ్చించగా దిగుబడులు తగ్గిపోయా మరోవైపు రైతులను గిట్టుబాటు ధర వేధిస్తోంది. ప్రస్తుత మార్కెట్‌లో క్వింటా రూ. 2 వేల లోపే ధర ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

నియోజకవర్గం సాగు విస్తీర్ణం

(హెక్టార్లలో)

నందికొట్కూరు 28,465

ఆళ్లగడ్డ 9,334

బనగానపల్లె 7,766

శ్రీశైలం 5,570

డోన్‌ 1,735

నంద్యాల 1,202

పాణ్యం, గడివేముల 1,336

రెండో ఏడాది కలిసి రాని

మొక్కజొన్న సాగు

ఎకరాకు రూ. 35 వేల పెట్టుబడి

20 నుంచి 22 క్వింటాళ్లకే దిగుబడి

లభించని గిట్టబాటు ధర

అన్నదాతకు మిగిలింది కన్నీరే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement