
మా సమస్యలు పరిష్కరించాల్సిందే
● డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట
పీహెచ్‌సీ వైద్యుల ఆందోళన
గోస్పాడు: న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాల్సిందేనని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంకిరెడ్డి అన్నారు. బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో వైద్యులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అంకిరెడ్డి మాట్లాడుతూ పీహెచ్‌సీ వైద్యుల సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇప్పటి వరకు పరిష్కారం లేదన్నారు. 20 ఏళ్లుగా పీహెచ్‌సీల్లో పనిచేస్తున్నా తమకు పదోన్నతులు రావడం లేదని, సీనియర్లు, జూనియర్లు ఒకే కేడర్‌లో పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్‌సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరించాలని, టైమ్ బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్ పే 50 శాతం ట్రైబల్ అలవెన్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలనికోరారు. అలాగే వైద్యులకు కచ్చితమైన పనిగంటలు ఏర్పాటు చేయాలని, స్థిరమైన వారాంతపు సెలవు ఇవ్వాలని, వైద్యుల జాబ్ చార్ట్ ఇవ్వాలని, అనధికార వ్యక్తులు(నాన్ మెడికల్, శాఖకు సంబంధం లేనివారు) పీహెచ్‌సీలను విచ్చలవిడిగా తనిఖీ చేయకుండా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. అలాగే గత మూడు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న చంద్రన్న సంచార చికిత్స అలవెన్స్‌ను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు కాంతారావు నాయక్, భరత్ కుమార్, ప్రణీత్, షబ్బీర్, హుసేని, ప్రసన్న లక్ష్మి, రూపేంద్రనాథరెడ్డి, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.