
జిల్లాకు రాష్ట్ర స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డు
నంద్యాల: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర అవార్డ్స్– 2025’లో నంద్యాల జిల్లాకు ఒక రాష్ట్రస్థాయి, 51 జిల్లాస్థాయి అవార్డులు లభించినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర (ఎస్‌ఏఎస్‌ఏ) కార్యక్రమం కింద రాష్ట్రంలో తొలిసారిగా సమగ్ర పరిశుభ్రతా సర్వే నిర్వహించి ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, ప్రజా ప్రదేశాల పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ఆర్‌ఆర్‌ఆర్ (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) వంటి స్థిరమైన ఆచరణల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన సంస్థలకు అవార్డులు కేటాయించారన్నారు. ఇందులో జిల్లా నుంచి ‘మన ఊరు – మన గుడి – మన బాధ్యత’ స్వచ్ఛంద సంస్థ రాష్ట్రస్థాయి అవార్డు పొందగా, జిల్లాస్థాయిలో 51 అవార్డులు లభించాయని తెలిపారు. స్వచ్ఛ మున్సిపాలిటీలు, స్వచ్ఛ గ్రామపంచాయతీలు, స్వచ్ఛ పాఠశాలలు, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్ స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమలు వంటి విభాగాలకు అవార్డులు ప్రకటించారన్నారు. ఈనెల 6వ తేదీన నంద్యాల జిల్లా కేంద్రంలో అవార్డు విజేతలను సన్మానించనున్నట్లు వెల్లడించారు. జిల్లాకు సంబంధించిన రాష్ట్రస్థాయి విజేతలు, జిల్లాస్థాయి అవార్డు విజేతల పూర్తి వివరాలు ప్రజలు పోర్టల్( https://sasa.ap.gov.in/) ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.