
రోడ్డు ప్రమాదంలో సైనికుడి మృతి
కర్నూలు(అర్బన్): విశాఖపట్నం ఇండియన్ నేవీలో విధులు నిర్వహిస్తున్న నగరంలోని క్రిష్ణానగర్‌కు చెందిన పీ రఘురామిరెడ్డి ఈ నెల 28వ తేదిన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నర్రా పేరయ్య తెలిపారు. ఆయన పార్థివదేహాన్ని కర్నూలులోని ఆయన నివాసానికి తీసుకువస్తున్నట్లు నేవీ ఉన్నతాధికారుల నుంచి ఇక్కడికి సమాచారం అందిందన్నారు. ఈ నెల 30వ తేదీన ఆయన అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా సైనిక్‌బోర్డు, నేవీ అధికారులు, మాజీ సైనికులు పాల్గొంటారని తెలిపారు. ఆయన మృతికి మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నదని, ఆయన కుటుంబానికి సంఘం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు.
తోటలో రైతు మృతి
కొలిమిగుండ్ల: మండల పరిధిలోని తోళ్లమడుగు గ్రామానికి చెందిన రైతు సద్దల చలమయ్య(60) మృతి చెందాడు. గ్రామానికి సమీపంలో చీని, నిమ్మ తోటలతో పాటు వరి సాగు చేస్తున్నాడు. సోమవారం కుటుంబ సభ్యులతో పాటు కూలీల తో పనుల్లో నిమగ్నమయ్యాడు. డ్రిప్‌కు సంబంధించి అన్ని వాల్వ్‌లు ఆఫ్ చేసి ఉంచడంతో మర్చిపోయి గేట్‌వాల్వ్ ఆన్‌చేశాడు. నీళ్ల ఒత్తిడికి పైపు ఎగిరి తలకు తగలడంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తర్వాత కూలీలు గమనించి చలమయ్య కుటుంబ సభ్యులకు తెలిపారు. చికిత్స కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఇంజినీరింగ్ అధికారులకు సెలవులు రద్దు
కర్నూలు (టౌన్): దేశ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 16వ తేదీ కర్నూలు నగరంలో పర్యటిస్తున్నందున నగరపాలక ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే ఇంజినీర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయాల ఉద్యోగులకు సెలవులను రద్దు చేస్తున్నట్లు నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వచ్చే నెల 7 వ తేదీ లోపు పూర్తి చేసిన అభివృద్ధి పనులకు సంబంధిచిన వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో డిస్ట్రిక్ట్ మాస్ ఎడ్యుకేషన్ మీడియా ఆఫీసర్ (డెమో)గా ఎన్.ప్రకాష్‌రాజు నియమితులయ్యారు. గుంటూరులోని పీఓడీటీటీలో పనిచేస్తున్న ఆయన్ను పదోన్నతిపై కర్నూలుకు బదిలీ చేశారు. ఇక్కడ ఇన్‌చార్జ్ డెమోగా ఉన్న పి.శ్రీనివాసులుశెట్టిని కర్నూలులోని రీజనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్ (మేల్)లో కమ్యూనికేషన్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. ఆయనతో పాటు రీజనల్ ట్రైనింగ్ సెంటర్ (ఫిమేల్) సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న ఎ.నిర్మలమ్మను తిరుపతిలోని ఎస్‌వీఎంసీలో ఉన్న ప్రసూతి హాస్పిటల్‌కు బదిలీ చేశారు.