
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
బనగానపల్లె రూరల్: బనగానపల్లె పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు సుమారు 40 ఏళ్ల వయస్సు, ఐదున్నర అడుగుల ఎత్తు కలిగిన వ్యక్తి, ఆదివారం రాత్రి పెట్రోల్‌బంకు సర్కిల్ నంద్యాల బస్సు స్టాప్ షెల్టర్ సమీపంలో ఉన్న స్తంభానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని కాపాడేందుకు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి శరీరంపై సిమెంట్ కలర్, హాఫ్ టీ షర్ట్, లైట్ బ్లూ కలర్ ఫుల్‌షర్ట్, సిమెంట్ కలర్ ప్యాంట్ ధరించినట్లు సీఐ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలియకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేశామని, మృతుడి వివరాలు తెలిసిన వారు 91211 01124కు సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు.
నాటుసారా కట్టడికి ప్రత్యేక బృందాలు
ఆలూరు రూరల్: దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో నాటు సారా తయారీ, విక్రయాలు, ఉత్సవాల రోజు మద్యం అమ్మకాలను అరికట్టేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్లు రాజశేఖర్, రామకృష్ణారెడ్డి తెలిపారు. దేవరగట్టు కొండల్లో సోమవారం ఆలూరు సీఐ లలిదాదేవి ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బన్ని ఉత్సవాల్లో నాటుసారా తయారు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు 69 మంది నాటు సారా తయారీ, విక్రయదారులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. ఆలూరు ఎకై ్సజ్ పరిధిలోని 5 మండలాల్లో నాటుసారా వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎస్‌ఐ నవీన్ కుమార్ పోలీసు సిబ్బంది ఉన్నారు.
ఉచిత క్యూలైన్ల మార్గంలో నాగుపాము
● భక్తులకు తప్పిన ప్రమాదం
మహానంది: మహానంది దేవస్థానంలో సోమవారం భక్తులకు ప్రమాదం తప్పింది. ఉచిత దర్శనం ద్వారా వెళ్లే క్యూలైన్ల మార్గంలో నాగుపాము ప్రత్యక్షం కావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఆలయ సిబ్బంది స్నేక్ క్యాచర్ మోహన్‌కు విషయం చెప్పగా ఆయన ఆలయానికి చేరుకుని నాగుపామును పట్టుకుని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేశారు.

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య