పెద్దాసుపత్రి నిధులకు ‘టెండర్‌’! | - | Sakshi
Sakshi News home page

పెద్దాసుపత్రి నిధులకు ‘టెండర్‌’!

Sep 27 2025 6:40 AM | Updated on Sep 27 2025 6:40 AM

పెద్దాసుపత్రి నిధులకు ‘టెండర్‌’!

పెద్దాసుపత్రి నిధులకు ‘టెండర్‌’!

‘తినేవాడు మనవాడైతే చాలు పంక్తిలో ఏ మూల కూర్చున్నా ముందుగా వారికే’ అన్నట్లు ఉంది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అధికారుల తీరు. కోట్ల రూపాయల విలువ జేసే ఆసుపత్రికి అవసరమైన మందులు, సర్జికల్స్‌ తదితరాల సరఫరా కాంట్రాక్టును తిరిగి పాత వారికే కట్టబెట్టారు. కొత్తవారు దరఖాస్తు చేసినా అర్హత లేదని తిరస్కరించారు. దీంతో అధికారంలో ఉన్న వారికి, అనుకూలమైన వారికే టెండర్‌ దక్కింది. దీంతో ఆసుపత్రిలో కోట్ల విలువైన నిధులకు ‘టెండర్‌’ వేసినట్లయ్యింది.

కర్నూలు(హాస్పిటల్‌): రాయలసీమ జిల్లాలకు తలమానికమైన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు సీమ జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం రోగులు చికిత్స నిమిత్తం వస్తుంటారు. ఈ ఆసుపత్రికి ప్రతిరోజూ 2,500 నుంచి 3వేల వరకు ఓపీ రోగులు, 1,200 నుంచి 1,500 వరకు ఇన్‌పేషంట్లు చికిత్స కోసం వస్తుంటారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం ఖరీదు కావడం, ఎన్‌టీఆర్‌ వైద్యసేవ సరిగ్గా అమలు కాకపోవడంతో ఇటీవల కాలంలో పెద్దాసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య మరింత పెరిగింది. ఒక్కోసారి ఓపీ రోగుల సంఖ్య 3,500 వరకు చేరుకుంటుండగా మెడికల్‌ వార్డుల్లో ఒక్కో పడకపై ఇద్దరేసి రోగులు చికిత్స అందుకుంటున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వీరందరికీ మందులు, సర్జికల్స్‌, ఆపరేషన్లకు ఇన్‌ప్లాంట్స్‌, వైద్యపరీక్షలకు రీ ఏజెన్స్‌కు ఆసుపత్రి ఖజానా నుంచి భారీగా ఖర్చు అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మందులు, సర్జికల్స్‌, రీ ఏజెన్స్‌, ఇన్‌ప్లాంట్స్‌ను ఏపీ ఎంఎస్‌ఐడీసీ డ్రగ్‌ స్టోర్‌ ద్వారా పంపిణీ చేస్తుంది. అక్కడ లభించని ఔషధాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అగ్రిమెంట్‌ చేసుకున్న ప్రధాన మంత్రి జన ఔషధి సంస్థ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంస్థ వద్ద కూడా మందులు లేకపోతే టెండర్‌ ద్వారా కాంట్రాక్టు దక్కించుకున్న వారి నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటికి ఆసుపత్రి అభివృద్ధి నిధులు, ఎన్‌టీఆర్‌ వైద్యసేవ నిధులను అధికారులు ఖర్చు చేస్తున్నారు. ఈ మేరకు రెండు, మూడేళ్ల గడువుతో టెండర్లు పిలుస్తున్నారు.

నిబంధనలతో ఎసరు

ఆసుపత్రిలో మందులు, సర్జికల్స్‌, ఇన్‌ప్లాంట్స్‌, రీ ఏజెన్స్‌ కొనుగోలు కోసం అధికారులు ప్రతి ఏటా రూ.3కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తాన్ని ఆసుపత్రి అభివృద్ధి సొసైటీతో పాటు, ఎన్‌టీఆర్‌ వైద్యసేవ నిధులను ఖర్చు చేస్తున్నారు. ఈ మేరకు గత నెలలో టెండర్‌ పిలిచారు. డిపాజిట్‌ను రూ.3లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచారు. సరఫరాదారు స్థానికుడై ఉండాలని, అనుభవం ఉండాలని నిబంధన పెట్టారు. అయినా కూడా నాలుగు కేటగిరీలకు 51 దరఖాస్తులు వచ్చాయి. నిబంధనల పేరుతో అధికారులు 25 మందికి మాత్రమే టెండర్‌ పాడేందుకు అవకాశం కల్పించారు. వీరిలో 20 మందికి టెండర్‌ దక్కింది. గతంలో స్థానికేతరులు సైతం మందులు సరఫరా చేశారు. వారు స్థానికంగా ఉన్న వ్యక్తులతో ఒప్పందం చేసుకుని రోగులకు మందులు అందేలా చర్యలు తీసుకున్నారు. ఈసారి స్థానికేతరులను పక్కనబెట్టారు. దీంతో ఈ టెండర్‌ విషయమై కొందరు కోర్టును ఆశ్రయించారు. అయినా కూడా అధికారులు టెండర్‌ నిర్వహించి స్థానికులకు కట్టబెట్టారు.

పక్కాగా ప్రణాళిక వేసి..

సాధారణంగా టెండర్‌లో ఎక్కువ మంది పాల్గొంటే పోటీతత్వం కారణంగా ధర తగ్గుతుంది. కొద్ది మందిని, అది కూడా స్థానికులను మాత్రమే టెండర్‌లో పాల్గొనేలా చేస్తే వారు చెప్పిన ధరకే కొనుగోలు చేయాల్సి వస్తుంది. మందులు, సర్జికల్స్‌, ఇన్‌ప్లాంట్స్‌, రీ ఏజెన్స్‌ ఒక్కో కంపెనీ ఒక్కో ధర, నాణ్యతలో తేడాలూ ఉంటాయి. ఉదాహరణకు పారాసిటమాల్‌ అనే మందును 10 మాత్రల స్రిప్‌ను ఒక కంపెనీ రూ.10లకు ఇస్తుండగా మరో కంపెనీ రూ.6లకు, ఇంకో కంపెనీ రూ.2లకు ఇస్తాయి. కొందరు బ్రాండెడ్‌ కాకుండా ప్రాపగండ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీల మందులను అతి తక్కువగా కొని ఇలాంటి టెండర్‌ పాడి సరఫరా చేస్తుంటారు. సర్జికల్స్‌, ఇన్‌ప్లాంట్స్‌, ల్యాబ్‌ రీ ఏజెన్స్‌ సైతం కొన్ని తక్కువగా మార్కెట్‌లో లభిస్తాయి. ఈ విషయాలపై పూర్తిగా అవగాహన ఉన్న అధికారులకే ఇలాంటి టెండర్‌లను నిర్వహించే సామర్ధ్యం ఉంటుంది. ఈ విషయాలన్నీ అవపోసన పట్టిన కొందరు అధికారులు, ఉద్యోగులు తమ వారికి టెండర్‌ను కట్టబెట్టేందుకు పక్కాగా ప్రణాళిక వేసి, నిబంధనల పేరుతో ఏ మార్చి మందులు, సర్జికల్స్‌, ఇన్‌ప్లాంట్స్‌, రీ ఏజెంట్స్‌లను తమకు అనుకూలురైన వారికి ఒక్కో కేటగిరిని ముగ్గురు, నలుగురికి కట్టబెట్టారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వీరిలో కొందరు 10 ఏళ్లుగా, మరికొందరు 15 నుంచి 20 ఏళ్లుగా ఆసుపత్రికి సరఫరా చేస్తున్న వారూ ఉండటం గమనార్హం. వీరు ఏటా సరఫరా చేసే వాటి విలువ రూ.3కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. టెండర్‌ వివరాలను ఆసుపత్రి అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇతరులకు ఎవ్వరికీ వివరాలు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో టెండర్‌ నిర్వహణపై అనుమానాలు మరింత రెట్టింపవుతున్నాయి.

అనుకూలమైన వారికి కాంట్రాక్టు

దక్కేలా నిబంధనల మార్పు

మెడికల్‌, సర్జికల్‌, రీ–ఏజెన్స్‌,

ఇన్‌ప్లాంట్స్‌ కేటాయింపులు

కొత్తవారు దరఖాస్తు చేస్తే

అనుభవం లేదంటూ తిరస్కరణ

టెండర్ల నిర్వహించి

రూ.3కోట్ల విలువైన పనుల అప్పగింత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement