
విశేష పూజలు
● శేష వాహనంపై
కనిపించిన ఆదిదంపతులు
● స్వామిఅమ్మవార్లను దర్శించుకుని
పులకించిన భక్తజనం
శేష వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు
విశేష పూజలు
నిర్వహిస్తున్న అర్చకులు
శ్రీశైలంటెంపుల్: దసరా మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లు శేష వాహనంపై కనిపించి భక్తులకు ఆశీస్సులు అందించారు. శేషవాహనంపై ప్రత్యేకంగా అలంకరించిన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అలంకార మండపంలో అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్కందమాత స్వరూపంలోని అమ్మవారిని, శేషవాహనంపై అధిష్టించిన స్వామిఅమ్మవార్లను కన్నులారా భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించుకుని నీరాజనాలు సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వర్షం కారణంగా స్వామిఅమ్మవార్లకు నిర్వహించాల్సిన గ్రామోత్సవం రద్దయింది.
స్కందమాత అలంకారంలో శ్రీశైల భ్రామరీ
నవదుర్గాలలో ఐదో రూపమైన స్కందమాత దేవి చతుర్భుజాలను కలిగి ఉంటారు. ఒక చేతిలో స్కందున్ని పట్టుకుని ఉండి, మిగిలిన చేతుల్లో పద్మాలను, అభయముద్రలను ధరించి ఉంటారు. ఈమె ఒడిలో బాలుని రూపంలో స్కందుడు(కుమారస్వామి)కూర్చొని ఉంటారు. స్కందదేవుని జనని కావడంతో ఈ దుర్గాస్వరూపం స్కందమాతగా ప్రసిద్ధి చెందారు. స్కందమాతను ఆరాధిస్తే సకల కోర్కెలు నెరవేరడంతో పాటు శాంతి సౌఖ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. దసరా నవరాత్రోత్సవాలల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం శ్రీశైల భ్రమరాంబాదేవి స్కందమాత స్వరూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కొలువుంచారు. అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజా హారతులనిచ్చారు.
శ్రీశైలంలో నేడు..
దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం శ్రీశైల క్షేత్రంలో కాత్యాయని అలంకారంలో అమ్మవారు, హంస వాహన సేవపై స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

విశేష పూజలు

విశేష పూజలు