
శ్రీశైలం, విజయవాడ వెళ్లే వాహనాల దారి మళ్లింపు
● సిద్ధాపురం అలుగు వద్ద
పోలీసుల బందోబస్తు
ఆత్మకూరు: భారీ వర్షంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆత్మకూరు మీదుగా శ్రీశైలం, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు, చీరాల తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. నల్లమలలోని రాళ్లవాగు ఉధృతితో సిద్ధాపురం చెరువుకు వరదనీరు పోటెత్తింది. ఫలితంగా సిద్ధాపురం చెరువు నిండి అలుగు దాటి ప్రమాద సూచికతో ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఆత్మకూరు పోలీసులు అప్రమత్తమై గురువారం రాత్రి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. నల్లమల నుంచి కర్నూలు–గుంటూరు జాతీయ రహదారి మీదుగా దోర్నాల వద్దే వాహనాలను నిలిపివేసినట్లు సీఐ రాము తెలిపారు. ఈ వాహనాలను దోర్నాల నుంచి మార్కాపురం, గిద్దలూరు మీదుగా నంద్యాల, ఆత్మకూరు, కర్నూలుకు చేరాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే బెంగళూరు, కర్నూలు మీదుగా వచ్చే వాహనాలను ఆత్మకూరు పట్టణంలోని నంద్యాల టర్నింగ్ వద్ద నంద్యాల, గిద్దలూరు, దోర్నాల మీదుగా శ్రీశైలం, విజయవాడకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే వరద అధికంగా అలుగు వద్ద ఉండడంతో దోర్నాల పోలీసులతో ఆత్మకూరు పోలీసులు మాట్లాడి వాహనాల రాకపోకలకు దారి మళ్లించారు. వరదరాజస్వామి ప్రాజెక్టుకు భారీ వరదనీరు చేరడంతో రాత్రి 9 గంటల సమయంలో హుటాహుటిన మొదటి గేటు ఎత్తి 1000 నుంచి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో కురుకుంద, కొత్తపల్లి, ఆత్మకూరు వద్ద ఉన్న భవనాశి నది, సుద్దవాగులు పొంగి ప్రవహించాయి. దీంతో రాకపోకలు నిలిపివేశారు. కురుకుంద, కొత్తపల్లి మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగును ఎట్టి పరిస్థితుల్లో దాటొద్దని సీఐ సూచించారు. రెండుచోట్ల పోలీసులు బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు. భారీ వర్షాలు కురవడంతో ఆత్మకూరు, కొత్తపల్లి మండలాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పగిడ్యాల మండలంలో అత్యధిక వర్షం
నంద్యాల(అర్బన్): జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. పగిడ్యాల మండలంలో అత్యధికంగా 36.4 మి.మీ వర్ష పాతం నమోదైంది. జూపాడుబంగ్లా, కొత్తపల్లిలో 26.8, శ్రీశైలంలో 23.4, నందికొట్కూరు, ఆత్మకూరులలో 18.4, పాములపాడులో 11.0, మిడుతూరులో 10.4 మి.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.