
పల్లెలు, పట్టణాల్లో ఆరోగ్య ప్రచారం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: సమగ్ర ఆరోగ్య ప్రచార రథాన్ని శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో, పట్టణాల్లో ఆరోగ్యంపై రథం ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తారని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారానే అన్ని రకాల ఆరోగ్య సమస్యల్లో 50 శాతం మేర పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. ఎయిడ్స్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను కూడా ప్రజలు తేలికగా ఎదుర్కొనగలిగే విధంగా వైద్య సిబ్బంది నిరంతరం కృషి చేయాలన్నారు. సమయానికి సరైన మందులు వాడితే వ్యాధులను పూర్తిగా నియంత్రణలో ఉంచవచ్చన్నారు. సమగ్ర ప్రచార రథంలో అమర్చిన ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా ఆరోగ్య అంశాలపై ప్రజలకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ – క్షయ వ్యాధి అధికారి డాక్టర్ శారదా బాయి మాట్లాడుతూ.. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సమితి మార్గదర్శకత్వంలో ఏపీ సాక్స్ ఆధ్వర్యంలో 15 రోజులపాటు నంద్యాల జిల్లాలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ, వైద్య అధికారులు డాక్టర్ కాంతారావు నాయక్, డాక్టర్ అవినాష్ రెడ్డి, డాక్టర్ తేజస్విని, డాక్టర్ నౌషీన్, ఏపీ సాక్స్ ప్రోగ్రామ్ గణాంక అధికారి దేవిశంకర్ గౌడ్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నాగరాజు, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.