
రైతుల భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
బేతంచెర్ల: రైతుల భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజకుమారి అన్నా రు. ఆర్‌ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన మధు శేఖర్ గౌడు తన పొలంలో రహదారి లేకున్న మరో రైతు అక్రమంగా తన పొలంలో వెళ్తున్నాడని, సమస్యను రెవెన్యూ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన విషయం విధితమే. స్వయంగా తానే సమస్యను పరిశీలించి పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఆర్‌ఎస్ రంగాపురం చేరుకుని పొలం రహదారిని పరిశీలించారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా, అనుభవం దారుల వివరాలను ఆర్డీఓ నరసింహులు, డిప్యూటీ తహసీల్దార్ మారుతి, మండల సర్వేయర్, వీఆర్వో మధుతో చర్చించారు. బాధితుడు మధు శేఖర్ గౌడు తాత ఈడిగ మద్దిలేటికి 1970లో 961–బీ2ఏ 5 ఎకరాల డీ పట్టాను ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కాని బాధితుడు రహదారికి సంబంధించి ఇచ్చిన దరఖాస్తు సర్వే నంబర్ 961– బీ2బీలో 2.62 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎవ్వరికి అసైన్‌మెంట్ చేయలేదని కలెక్టర్, ఆర్డీఓ నరసింహులు విన్నవించారు. ఇరువర్గాల రైతుల సమస్యల విన్న అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇద్దరి రైతులకు నోటీసులు ఇచ్చి తుది నివేదిక మంజూరు చేస్తానని, 15 రోజుల తరువాత ఇచ్చే తుది నివేదికకు ఇరువర్గాలు కట్టుబడి ఉండాలని హెచ్చరించారు. రంగాపురం గ్రామానికి చెందిన మాధవ రెడ్డి మరి కొంత మంది గ్రామస్తులు 340(బీ) జాతీయ రహదారి నిర్మాణంలో తమ దుకాణాలు కూల్చి వేయడంతో ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.